లోక్‌సభలో ‘పెగసస్‌’ మంటలు

24 Jul, 2021 03:25 IST|Sakshi
ఢిల్లీలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు

వరుసగా నాలుగో రోజు ప్రతిపక్షాల ఆందోళన

సభా వ్యవహారాలకు అంతరాయం

సభను సోమవారానికి వాయిదా వేసిన డిప్యూటీ స్పీకర్‌ 

న్యూఢిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్, కొత్త సాగు చట్టాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు లోక్‌సభ అట్టుడికింది. శుక్రవారం ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి సభా కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం కలిగించడంతో డిప్యూటీ స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు. తొలుత ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కొందరు ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. స్పీకర్‌ ఓంబిర్లా సూచన మేరకు ఆయా పార్టీల సభాపక్ష నాయకులు వారిని వెనక్కి తీసుకెళ్లారు. టోక్యో ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.

క్రీడాకారులకు సంఘీభావం తెలియజేస్తూ పలువురు ఎంపీలు నీలం రంగు టీ–షర్టులు ధరించి సభకు వచ్చారు. మన క్రీడాకారులకు మద్దతుగా ఎంపీలు బల్లలు చరిచారు. అనంతరం కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన పలువురు ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. ఫోన్ల హ్యాకింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పెగసస్‌ స్పైవేర్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. పెగసస్‌ అంశంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ సెల్‌ఫోన్లను స్పీకర్‌కు కనిపించేలా చూపారు.

సీనియర్లు ప్రవర్తించేది ఇలాగేనా?
కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని శిరోమణి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్లకార్డు ప్రదర్శించారు. జసూసీ కర్నా బంద్‌ కరో(గూఢచర్యం ఆపండి) అంటూ ప్రతిపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం ఇస్తారని, సభ్యులు శాంతించాలని స్పీకర్‌ పదేపదే కోరినప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. 

ఆందోళనలు ఆగకపోవడంతో ఉదయం 11.20 గంటలకు స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ 12 గంటలకు సభ ప్రారంభం కాగానే సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన సాగించారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ కిరీట్‌ సోలంకి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోలేదు. అదేసమయంలో పలు పార్లమెంటరీ కమిటీల్లో కొత్త సభ్యులను నియమిస్తూ తీర్మానాలను ఆమోదించారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై డిప్యూటీ స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు. సీనియర్‌ సభ్యులు సైతం ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. సభను సోమవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభ ఎంపీ శంతను సేన్‌ సస్పెన్షన్‌
పెగసస్‌ స్పైవేర్, ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో రాజ్యసభ నాలుగు సార్లు సభ వాయిదా పడింది. సభ్యుల నిరసనలతో సభను స్పీకర్‌ సోమవారానికి వాయిదా వేశారు. టీఎంసీ సభ్యుడు శంతను సేన్‌ గురువారం రాజ్యసభలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేతిలోని పత్రాలను లాక్కొని చింపేసిన విషయం తెలిసిందే. దీంతో శంతను సేన్‌ను సభ నుంచి బహిష్కరిస్తూ శుక్రవారం ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు శంతను సేన్‌ సభకు హాజరయ్యారు. బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు