ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మొదలైన ఫిరాయింపుల పర్వం? 

17 Dec, 2021 14:48 IST|Sakshi

ఎమ్మెన్నెస్, బీజేపీ నుంచి ఎన్సీపీలోకి చేరికలు 

అజిత్‌పవార్‌ సమక్షంలో ఎన్సీపీలో చేరిన రూపాలీ పాటిల్‌ 

ఛగన్‌ భుజ్‌బల్‌ చేత కండువా కప్పించుకున్న సంజయ్‌ పవార్‌

సాక్షి, ముంబై: రాష్ట్రంలో వివిధ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల పర్వం మొదలైనట్లే కనిపిస్తోంది. గురువారం మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) మహిళా నేత రూపాలీ పాటిల్, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంజయ్‌ పవార్‌ నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు. రూపాలీ పాటిల్‌ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్, కేబినెట్‌ మంత్రి జయంత్‌ పాటిల్‌ సమక్షంలో ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పుణేలో అజిత్‌ పవార్‌ చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు తాను ఆకర్శితురాలిని అయ్యానని, అందుకే ఎన్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా రూపాలీ వెల్లడించారు. తాను ఎమ్మెన్నెస్‌లో ఉన్నప్పటికీ మరో పార్టీ అనే భేదం లేకుండా పవార్‌ తనతో సంప్రదింపులు జరిపేవారని, సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అజిత్‌ పవార్‌ పనితీరును ఆమె మెచ్చుకున్నారు.

చదవండి: (ఆమె సంకల్పానికి సలాం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి..)

మారుతున్న కాలాన్ని బట్టి మనమూ మారాలని, ఈ విషయాన్ని తాను అనేకసార్లు రాజ్‌ ఠాక్రే దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ, పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు ఎమ్మెన్నెస్‌లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. దీంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. త్వరలో పుణేలో జరగనున్న భారీ సదస్సులో మరింత మంది మహిళా నేతలు ఎన్సీపీలో చేరతారని చెప్పారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ.. రూపాలీ చేరికతో పుణేలో ఎన్సీపీ మహిళా విభాగం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. తమ పార్టీ కుల, మత భేదాలన్నింటినీ పక్కన పెట్టి అందరినీ కలుపుకొని ముందుకు పోతుందని స్పష్టం చేశారు. కాగా, రూపాలీ ఎన్సీపీలో చేరడంతో పుణేలో ఎమ్మెన్నెస్‌కు గట్టి దెబ్బ తగలనుందని చెప్పవచ్చు.  

సంజయ్‌కు కండువా కప్పిన భుజ్‌బల్‌ 
నాంద్‌గావ్‌ మాజీ ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన సంజయ్‌ పవార్‌ గురువారం నాసిక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ సమక్షంలో ఎన్సీపీలో చేరారు. ఈ సందర్భంగా భుజ్‌బల్‌ ఆయనకు ఎన్సీపీ ఖండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, 2004–2009 మధ్య కాలంలో శివసేన ఎమ్మెల్యేగా పని చేసిన సంజయ్‌ పవార్, తదనంతర కాలంలో శివసేన నుంచి బయటకు వచ్చి ఎన్సీపీలో చేరారు. ఆ తరువాత మళ్లీ శివసేనలో చేరిన ఆయన, ఆ తరువాత బీజేపీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. అక్కడ కూడా ఇమడలేక తాజాగా ఎన్సీపీలో చేరిన సంజయ్‌ పవార్‌.. ఇకపై తాను పార్టీలు మారనని, కడ వరకు ఎన్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు