‘అప్పుడు ఆజాద్‌.. ఇప్పుడు గెహ్లట్‌.. మోదీ ప్రశంసలు ఆసక్తికరం’.. పైలట్‌ సంచలన వ్యాఖ్యలు

2 Nov, 2022 15:20 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌ అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌, సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వైరం బయటపడుతూనే ఉంది. తాజాగా సచిన్‌ పైలట్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం అశోక్‌ గెహ్లట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించటంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీ మాజీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో పోలుస్తూ విమర్శలు గుప్పించారు.

‘నిన్న ముఖ్యమంత్రిని ప్రధాని మోదీ పొగడటం చాలా ఆసక్తికరం. దీనిని తేలిగ్గా తీసుకోకూడదు. గతంలో పార్లమెంట్‌ వేదికగా గులాం నబీ ఆజాద్‌ను మోదీ ప్రశంసించారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు.’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు సచిన్‌ పైలట్‌. మరోవైపు.. రాజస్థాన్‌లో పార్టీని ధిక్కరిస్తూ తిరుగుబాటు చేసే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సూచించారు. రాజస్థాన్‌లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితికి ముగింపు పలకాలన్నారు. సెప్టెంబర్‌లో జరగాల్సిన సీఎల్పీ సమావేశం ఆగిపోవటాన్ని ఏఐసీసీ క్రమశిక్షణా రాహిత్యంగా భావించాలని సూచించారు. 

రాజస్థాన్‌ బాన్‌స్వారాలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రశంసించిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు పైలట్‌. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రులుగా అశోక్‌ జీ, నేను కలిసి పని చేశాం. మన సీఎంలలో ఆయనే అత్యంత సీనియర్‌. వేదికపై ఉన్నవారిలోనూ ఆయనే సీనియర్‌’ అంటూ ప్రశంసలు కురిపించారు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు!

మరిన్ని వార్తలు