హైకమాండ్‌ ముందు పైలట్‌ డిమాండ్లు ఇవే..

10 Aug, 2020 18:34 IST|Sakshi

సర్కార్‌ సజావుగా సాగేందుకు కమిటీ ఏర్పాటు

సాక్షి, న్యూఢిల్లీ: క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన రాజస్తాన్‌ రాజకీయ హైడ్రామా కీలక ఘట్టానికి చేరింది. ఆగస్ట్‌ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో పాలక కాంగ్రెస్‌లో గహ్లోత్‌, పైలట్‌ శిబిరాల మధ్య రాజీ ఫార్ములాకు తెరలేచింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ సోమవారం రాహుల్‌ గాంధీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన సమావేశంలో పార్టీలో చీలికను నివారించి రాజకీయ సంక్షోభానికి తెరదించడం‍పై రాహుల్‌, ప్రియాంక గాంధీలతో తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ చర్చించారు. తాను తిరిగి పార్టీ గూటికి చేరాలంటే మూడు ప్రధాన డిమాండ్లను పైలట్‌ అగ్ర నేతల ముందుంచినట్టు తెలిసింది. భవిష్యత్‌లో తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తామని బహిరంగ ప్రకటన చేయడం, ఇది సాధ్యం కానిపక్షంలో తన వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలను డిప్యూటీ సీఎంలుగా నియమించాలని స్పష్టం చేశారు.

తమ వర్గానికి చెందిన ఇతర నేతలను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకోవడంతో పాటు నామినేషన్‌ పదవులకు ఎంపిక చేయాలని పైలట్‌ హైకమాండ్‌కు స్పష్టం చేశారు. తనను జాతీయస్ధాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పైలట్‌ హైకమాండ్‌ ముందు రాజీ ఫార్ములాను ప్రతిపాదించారు. కాగా పార్టీపై తిరుగుబాటు నేపథ్యంలో పైలట్‌ కోల్పోయిన డిప్యూటీ సీఎంతో పాటు రాజస్తాన్‌ పీసీసీ చీఫ్‌ పదవులను తొలుత చేపట్టాలని ఆయనను రాహుల్‌ కోరారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ గూటికి తిరిగి వస్తే ప్రభుత్వ పనితీరు కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని పైలట్‌కు రాహుల్‌ హామీ ఇచ్చారని తెలిసింది. సచిన్‌ పైలట్‌ శిబిరానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలందరితో మాట్లాడేందుకు రాహుల్‌ ఆసక్తి కనబరిచారని సమాచారం. ఇక అసెంబ్లీలో బలనిరూపణకు గడువు ముంచుకొస్తుండటంతో అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగివస్తే స్వాగతిస్తామని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు.

చదవండి : గహ్లోత్‌కు మద్దతుగా పైలట్‌ వర్గం!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా