హోరెత్తిన ‘పోడు’ పోరు

6 Oct, 2021 02:15 IST|Sakshi
సడక్‌ బంద్‌ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ

గిరిజన రైతుల పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే.... 

నినదించిన అఖిలపక్ష నేతలు.. అన్ని జిల్లాల్లోనూ సడక్‌బంద్‌..  

అశ్వారావుపేట నిరసనలో తమ్మినేని, చాడ వెంకట్‌రెడ్డి 

సాక్షి నెట్‌వర్క్‌: పోడుభూముల పోరు తీవ్రతరమైంది. వెంటనే పట్టాలివ్వాలని మంగళవారం గిరిజన రైతులు రోడ్డెక్కారు. అటవీ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ అన్ని జిల్లాల్లోనూ సడక్‌బంద్‌ నిర్వహించారు. కదంతొక్కారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాగా, పోడుభూముల కోసం పోరాడే గిరిజనులను జైళ్లలో పెట్టడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పోడుసాగుదారులకు పట్టాలివ్వాలనే డిమాండ్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చేపట్టిన రాస్తారోకోలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బోయిన నర్సింహులు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చంద్రుగొండ, ములకలపల్లి, పాల్వంచల్లో కూడా రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కారేపల్లి, కొణిజర్ల, సత్తుపల్లి, పెనుబల్లిల్లోనూ వివిధ పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 

పేద గిరిజన రైతులకు వెంటనే పట్టాలివ్వాలి 
పోడు భూములు గిరిజనుల హక్కు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం పరిధిలోని హైదరాబాద్‌–శ్రీశైలం హైవేపైనున్న హాజీపూర్‌ చౌరస్తాలో నల్లమల సడక్‌బంద్‌ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వంశీకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేతలు నంద్యాల నర్సింహారెడ్డి, జాన్‌వెస్లీ హాజరయ్యారు. అంతకుముందు నారాయణ హైదరాబాద్‌ నుంచి హజీపూర్‌ వెళ్తూ డిండిలో మీడియాతో మాట్లాడా రు. కేసీఆర్‌ గిరిజనుల వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా అని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. 

అసెంబ్లీలో తీర్మానం చేయాలి 
ఉమ్మడి వరంగల్‌లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యాన మంగళవారం చేపట్టిన ‘సడక్‌ బంద్‌’విజయవంతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన, ఎమ్మార్పీఎస్‌ తదితర సంఘాలు రాస్తారోకోలు నిర్వహించారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.  

పోడు భూములపై ఆందోళన 
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో సడక్‌ బంద్‌ నిర్వహించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని మిర్యాలగూడలో గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. సూర్యాపేటలో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కిలోమీటర్‌ మేర నిలిచిన వాహనాలు 
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్‌ నాయకులు నిజామాబాద్‌ జిల్లా గన్నారం వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై గంటపాటు బైఠాయించారు. దీంతో కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మాజీమంత్రి సుదర్శన్‌ రెడ్డి, కిసాన్‌ ఖేత్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్‌ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై, బాన్సువాడ, గాంధారిలో రాస్తారోకో నిర్వహించారు.  

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం 
ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఎక్స్‌రోడ్డు, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్, సత్తెనపల్లి, కడెంలోని పాండ్వపూర్, దస్తురాబాద్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, దహెగాం, సిర్పూర్‌(టి) మండల కేంద్రాల్లో సడక్‌ బంద్‌ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం, బెల్లంపల్లి, నెన్నెల, లక్సెట్టిపేట, కోటపల్లి, చెన్నూర్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. ఉట్నూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద సడక్‌బంద్‌లో టీజేఎస్‌ అధినేత కోదండరాం పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు