ఓట్ల కోసం రాజకీయం చేయట్లేదు

18 Nov, 2022 05:29 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి బొత్స, చిత్రంలో సజ్జల

ప్రజల అభ్యున్నతి కోసమే సంక్షేమ పథకాలు 

గత ప్రభుత్వం ఉద్యోగులను వాడుకుని వదిలేసింది 

ఉద్యోగ సంఘాల భేటీలో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల కోసం రాజకీయాలు చేయట్లేదని.. సమాజంలోని అంతరాలను తగ్గించి.. అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు సీఎం జగన్‌ కృషిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలకు విద్య, వైద్యం, ఆరోగ్య కల్పన కోసమే అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డికి సచివాలయంలో కేటాయించిన చాంబర్‌ను మంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం మరో సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఉద్యోగ సంఘాల నాయకులతో వారు భేటీ అయ్యారు.

ఆ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు 4.70 కోట్ల మంది ప్రజల సంక్షేమ బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. అటువంటి ఉద్యోగుల కోరికలు, ఆకాంక్షలను తాము ఎప్పుడూ గౌరవిస్తామన్నారు. కానీ, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ కంటే తీసిపోని విధంగా ఉద్యోగులకు మేలు చేస్తున్నామని, అందుకే సీఎం జగన్‌ ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య సంధానకర్తగా ప్రత్యేక సలహాదారును నియమించినట్లు వివరించారు.

ఇటీవల ఎంఈవో పోస్టుల భర్తీ విషయంలో ఒకరిద్దరు కోర్టులకు వెళ్లడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. త్వరలోనే వర్సిటీలు, ఎయిడెడ్‌ ఉద్యోగులకు కూడా ఇది వర్తించేలా ఉత్తర్వులు వస్తాయన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులకూ రిటైర్మెంట్‌ వయసును పెంచే అంశం పరిశీలనలో ఉందన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు.

చంద్రబాబుకు చివరి ఎన్నికలు
మరోవైపు.. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని, ఆయన అనుకున్నట్లే దేవుడు తథాస్తు అంటాడని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ప్రజలు కూడా ఇంటికి పంపించేలా తీర్పు ఇస్తారన్నారు. బాబు అధికారంలో ఉంటే అరిష్టం చుట్టుకోవడంతో పాటు అతివృష్టి, అనావృష్టి ఆవరిస్తుందన్నారు. అసెంబ్లీలో ఆయన కుటుంబ సభ్యుల ప్రస్తావన తేకున్నా.. సానుభూతి కోసం డ్రామాలాడటం నీచమని మంత్రి మండిపడ్డారు.  

ఉద్యోగులతో రాజకీయాలు చేయం: సజ్జల
ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మధ్య గత ప్రభుత్వం విభేదాలు సృష్టించి వాడుకుని వదిలేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కానీ, తమకు ఉద్యోగులతో రాజకీయాలు చేయాల్సిన అవసరంలేదన్నారు. సీఎం టీంలో ఉద్యోగులు ఒక భాగమన్నారు. అన్ని సంఘాలను సమానంగా చూస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితులను బట్టి ఉద్యోగులకు వీలైనంత మేలుచేసేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.  

చంద్రబాబుకు 2019లోనే చివరి ఎన్నికలయ్యాయని, అప్పుడే ప్రజలు తిరస్కరించారని సజ్జల అన్నారు. ప్రజలిచ్చిన అవకాశాలను ఆయన ఎప్పుడూ సద్వినియోగం చేసుకోలేదన్నారు. ఇప్పుడు దింపుడు కళ్లెం ఆశలా చేస్తున్న ప్రయత్నంలోనూ దిగజారుడుతనం చూపిస్తున్నాడన్నారు. ఈసారి ఎన్నికల్లో 23 సీట్లనూ తీసేసేలా ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారన్నారు. తనను అధికారంలో కూర్చోబెట్టడం ప్రజల బాధ్యత అన్నట్లు హెచ్చరిక మాటలు బాబు దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సమస్యలను విన్నవించారు.  

>
మరిన్ని వార్తలు