వ్యవసాయంలో ఏపీ 6వ స్థానం.. మేనిఫెస్టోనే ప్రభుత్వానికి గీటురాయి: సజ్జల

8 Nov, 2023 13:49 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 4.93 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఏపీ రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. మహమ్మారి అవతరించిన సమయంలోనూ రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన పొందారని పేర్కొన్నారు. అభివృద్ధి పరంగా మంచి ప్రగతిని సాధించామని తెలిపారు.

విద్య, వైద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
చంద్రబాబు పాలనలో తలసరి ఆదాయంలో 17వ స్థానంలో ఉంటే ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నామని సజ్జల పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 2019లో ఏపీ జీఎస్‌డీపీ 22వ స్థానం కాగా.. 2021-22లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. విద్య, వైద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు. 

వ్యవసాయంలో ఏపీ 6వ స్థానం..
16,500 కోట్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామని సజ్జల చెప్పారు. వ్యవసాయంలో గత హయాంలో 27వస్థానం ఉంటే.. అప్పట్లో వృద్ధి రేటు 6.5శాతం ఉండేందని ప్రస్తావించారు. ప్రస్తుతం వ్యవసాయంలో ఏపీ 6వ స్థానంలో ఉందని, వృద్ధిరేటు 8శాతం సాధించామని తెలిపారు. తలసరి ఆదాయంలో ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నామని, ఈ మ్యానిఫెస్టోనే వైస్సార్‌సీపీ ప్రభుత్వానికి గీటురాయని పేర్కొన్నారు. 
చదవండి: ‘చంద్రబాబుకు దృష్టిలోపం.. అందుకే పేదల వైపు చూడలేకపోయాడు’

రేపటి నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం
‘గురువారం నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సీఎం జగన్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి. సంక్షేమం ద్వారా అభివృద్ధి, సంక్షేమమే అభివృద్ధి అని ప్రభుత్వం భావిస్తోంది.  సచివాలయం ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం. ఇది కదా అభివృద్ధి అనే విధంగా ప్రజలకు చూపిస్తాం.

కుట్రపూరితంగా మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. బాబు పాలనలో ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్‌ ఉంది. ప్రతి స్కీమ్‌లోనూ వచ్చే లాభంపైనే చంద్రబాబు ఫోకస్‌. కులమతాలకు అతీతంగా పారదర్శక పాలన సీఎం జగన్‌ అందిస్తున్నారు. త్వరలో డోర్‌టు డోర్‌ క్యాంపెయిన్‌ మొదలు పెడతాం’ అని సజ్జల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు