టీడీపీకి దిమ్మతిరిగే తీర్పు రావాలి

4 Nov, 2021 04:20 IST|Sakshi
ప్రసంగిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, వేదికపై మంత్రులు బాలినేని, అనిల్‌కుమార్‌ తదితరులు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల, మంత్రి బాలినేని  

నెల్లూరు కార్పొరేషన్‌ 54 డివిజన్లలోనూ అత్యధిక మెజార్టీతో గెలవాలి

ఇంటింటికీ వెళ్లి నవరత్నాలతో పొందుతున్న లబ్ధిని గుర్తు చేయండి

సీఎం వైఎస్‌ జగన్‌ పాలనకు నిదర్శనంగా రిజల్ట్‌ ఉండాలి

నెల్లూరు(సెంట్రల్‌): నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు టీడీపీకి దిమ్మతిరిగేలా ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను ప్రజలు గెలిపిస్తారనే ధీమా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కన్నా మెజార్టీ ముఖ్యమన్నారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా మెజార్టీని తీసుకురావడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. నెల్లూరులోని ఒక హోటల్‌లో బుధవారం మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కలసి కార్పొరేటర్లుగా పోటీలో ఉన్న అభ్యర్థులను సజ్జలకు, బాలినేనికి పరిచయం చేశారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు. కార్పొరేషన్‌కు సంబంధించి ఇతర పార్టీల వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం తమవైపే ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వారిని గుర్తించి టికెట్లు ఇచ్చామని చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే జట్టుగా అడుగులు వేసి విజయం కోసం కృషి చేస్తారన్నారు. ప్రతి ఇంట్లో నవరత్నాల పథకం వల్ల లబ్ధి పొందిన వాళ్లు ఉన్నారని, వారికి మళ్లీ పథకాల అమలు తీరు, ఏం లబ్ధి పొందుతున్నారు అనేది గుర్తుచేయాలన్నారు.

ఎన్నికల్లో తీర్పు అనేది సీఎం జగన్‌ పాలనకు నిదర్శనంగా ఉండాలని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. డివిజన్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సీఎం అమలు చేస్తున్న పథకాలే మనకు శ్రీరామరక్ష లాగా ప్రజలు ఆశీర్వాదాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ, రూరల్‌పై ఉంచిన నమ్మకం వమ్ము కాకుండా అధిక మెజార్టీతో 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జ్‌ కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, నుడా చైర్మన్‌ ద్వారకానాథ్, పి.రూప్‌కుమార్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు