మున్సిపాలిటీల్లోనూ పంచాయతీ ఫలితాలే..

2 Mar, 2021 04:52 IST|Sakshi
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి, చిత్రంలో మంత్రి బొత్స తదితరులు

టీడీపీకి నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు కరువు

పైగా నామినేషన్లు వేయనివ్వడం లేదంటూ చంద్రబాబు రాద్ధాంతం

అన్ని మున్సిపాలిటీల్లోను వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం

వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా ఇన్‌చార్జి సజ్జల

నిరాశ, నిస్పృహలతోనే చంద్రబాబు నిరసన డ్రామాలు: మంత్రి బొత్స

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే రానున్నాయని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. గత 20 నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న పథకాలే తమ పార్టీ గెలుపునకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఆయన సోమవారం అనంతపురంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ జిల్లా ఇన్‌చార్జీలు, పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీకి ఎన్నికల్లో పోటీచేసేందుకు కనీసం అభ్యర్థులు దొరకడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితిని కప్పిపుచ్చుకునేందుకు నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను బెదిరిస్తున్నారంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించడం శోచనీయమన్నారు. తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు నేలమీద కూర్చుని నాటకలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు చంద్రబాబును నమ్మేస్థితిలో లేరన్నారు. ప్రజలకు అందే సంక్షేమ పథకాలు నిలిచిపోయి వారు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే.. వలంటీర్ల నుంచి ఫోన్లు తీసుకోవాలంటూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందని చెప్పారు.

ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తామని.. అయితే ఈ పేరుతో ప్రజలను ఇబ్బందిపెట్టకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పట్టణ ప్రజలపై భారీగా పన్నుల భారం మోపారని చెప్పారు. కనీసం ఏం చేయగలమో కూడా తెలియకుండానే, ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిందని విమర్శించారు. టీడీపీ పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో ఉందని, అందుకే ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు నిరసన డ్రామాకు తెరలేపారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి, అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు