బీసీల కోసం చట్టసవరణకైనా సీఎం జగన్‌ సిధ్దం 

14 Sep, 2021 04:32 IST|Sakshi

పద్మశాలీయుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్సార్‌సీపీ 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

సాక్షి, అమరావతి: బీసీలకు సంబంధించి ఏ అంశంలోనైనా వారికి ప్రయోజనం కలుగుతుందనుకుంటే ఎలాంటి చట్ట సవరణకైనా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మన దేశ విశిష్టతను ప్రపంచానికి తెలియజేసిన కళల్లో చేనేత కళ ప్రముఖమైనదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పద్మశాలీయ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి అధ్యక్షతన పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చేనేత వృత్తిలో ఉన్నవాళ్ల  బాధలను తెలుసుకుని సీఎం జగన్‌ వారికోసం నేతన్ననేస్తం పథకం ప్రవేశపెట్టారని చెప్పారు.

చేనేత వృత్తిలో కొనసాగే పద్మశాలి కులస్తులు వారి ఉపకులాలకు సంబంధించి నాలుగు కార్పొరేషన్లను ఏర్పాటుచేయడం ద్వారా అత్యధికమందికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఇద్దరు పద్మశాలీయుల్ని పార్లమెంట్‌కు పంపారని, ఎమ్మెల్సీలుగా, మునిసిపల్‌ చైర్మన్లుగా ఎంపిక చేశారని చెప్పారు. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రసంగించారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత, ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి మోహన్‌రావు, ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యులు అవ్వారు ముసలయ్య, నవరత్నాల నారాయణమూర్తి, పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్లు, పద్మశాలి సంఘం రాష్ట్ర నేతలు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు