ఆరో తేదీ నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు

1 Nov, 2020 04:03 IST|Sakshi

పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహణ

వైఎస్‌ జగన్‌ 14 నెలల సుదీర్ఘకాలం ప్రజల్లోనే ఉన్నారు

అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే 90 శాతం హామీలను నెరవేర్చారు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజాసంకల్ప పాదయాత్రకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్‌ 6 నుంచి పది రోజుల పాటు ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దారుణ పాలన సాగుతున్న తరుణంలో 2017 నవంబర్‌ 6న వైఎస్‌ జగన్‌ కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు యాత్రను ప్రారంభించారన్నారు. ఎండనక, వాననక 14 నెలల సుదీర్ఘకాలం ప్రజల్లోనే ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 17 నెలల పాలనలో ఎంతమేర సఫలీకృతమయ్యాం? ఇంకా ఏం చేయాలి? ప్రజలకు ఇంకా ఉన్న సమస్యలేమిటి? అనే అంశాలపై పార్టీ నేతలు, కార్యకర్తలతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

మున్నెన్నడూ లేని పెద్ద మార్పు జరిగింది..
గత మూడేళ్లలో ఏపీలో మున్నెన్నడూ లేని పెద్ద మార్పు జరిగింది. ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పొడవునా ఇచ్ఛాపురం వరకూ సాగింది. ఎక్కడా.. ఎప్పుడూ లేని విధంగా వైఎస్‌ జగన్‌ ఒకే జాబితాలో అసెంబ్లీ ఎన్నికలకు 175 మందిని, లోక్‌సభ ఎన్నికలకు 25 మందిని ప్రకటించి చరిత్ర సృష్టించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను అఖండ మెజారిటీతో గెలిపించి మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 

స్తబ్దత నుంచి చైతన్యం వైపునకు..
చంద్రబాబు మాఫియా ముఠా పాలన నుంచి చీకటి తర్వాత తొలిపొద్దు పొడిచినట్లు.. ఒక స్తబ్ధత నుంచి చైతన్యం వైపునకు అడుగులు వేసినట్లు జగన్‌ పాలనను రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. చంద్రబాబు హయాంలో పది రూపాయల పనిని వంద చేసి దోచుకుతిన్నారు. వైఎస్‌ జగన్‌ది మహిళ, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల పక్షపాత ప్రభుత్వం. కొద్ది రోజుల క్రితమే 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చాం. అమ్మఒడి, ఆసరా, చేయూత, పేదవాళ్లకు ఇళ్లు ఇలా ఏ పథకం తీసుకున్నా మహిళలకే పెద్దపీట వేస్తున్నాం. మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారిని ఆర్థికంగా శక్తిమంతులను చేస్తున్నాం. 

పాలనలో విప్లవాత్మక మార్పులు..
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దిన మేనిఫెస్టోలో 90 శాతం హామీలను నెరవేర్చారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థల ఏర్పాటుతోపాటు విద్య, వైద్య వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. కొద్ది నెలల్లోనే ఒక్కో నూతన పథకాన్ని.. వ్యవస్థల్ని ప్రారంభిస్తూ, ఎంతో గుండెనిబ్బరంతో ఏడాదిన్నరలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇన్ని పథకాలు అమలు చేస్తున్న ఆయన ఆ డబ్బులు ఎక్కడ నుంచి తెస్తున్నారు.. ఎలా చేస్తున్నారు అని మాట్లాడేవారే తప్ప.. ఎక్కడికి పోతుందని ఏ ఒక్కరూ విమర్శించే పరిస్థితి లేదు. దేశ చరిత్రలోనే వైఎస్‌ జగన్‌ ఒక చోదక శక్తిగా.. నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టిన దార్శనికుడిగా.. చిన్న వయసులోనే నిజమైన ప్రజా నాయకుడిగా.. అరుదైన రాజనీతిజ్ఞుడిగా నిలిచారు. ఒక సాక్షిగా, జర్నలిస్టుగా, పార్టీలో కార్యకర్తగా ఆయనను చూసి గర్వపడుతున్నా. జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని ప్రజల మేలు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.   

మరిన్ని వార్తలు