ఎదిరించే దమ్ములేక... నీచ రాజకీయాలు

7 Apr, 2021 03:47 IST|Sakshi

టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పన్నాగం

నాడు టీడీపీ–కాంగ్రెస్‌ లాలూచీతోనే జగన్‌పై కేసులు

బెయిల్‌ రద్దు చేస్తారనే తప్పుడు ప్రచారం

వైఎస్‌ వివేకా హత్య కేసును చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నారు

తనపై హత్యాయత్నం కేసులోనే జగన్‌ జోక్యం లేదు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: జన హృదయాల్లో జగన్‌ వేసుకున్న బంధాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన జీర్ణించుకోలేకనే.. కలసికట్టుగా నీచ రాజకీయాలకు తెగబడ్డాయని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. జగన్‌కు బెయిల్‌ రద్దవుతుందనే విష ప్రచారం.. వివేకా హత్యోదంతాన్ని ప్రచారంలోకి తేవడం గూడుపుఠాణిలో భాగమేనన్నారు. జగన్‌పై పెట్టినవి తప్పుడు కేసులు కాబట్టే ప్రతీ ఎన్నికల్లోనూ ప్రజలు వాటిని తిరస్కరిస్తున్నారని, జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ కలుషిత రాజకీయాలే చేస్తోందని, ఇప్పుడీ పార్టీకి బీజేపీ, జనసేన తోడయ్యాయని విమర్శించారు. తిరుపతి పోరులో కనీస ఓట్లకోసం చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వారం రోజులుగా విపక్షాల విష ప్రచారం తారస్థాయికి చేరిందన్నారు. జగన్‌పై పెట్టిన తప్పుడు కేసులు, వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు. ‘‘చంద్రబాబుకు ఎప్పుడూ ఊతకర్ర కావాలి. మామనో, వాజ్‌పేయ్‌నో అడ్డుపెట్టుకుని గెలిచాడే తప్ప.. సొంతంగా విజయం సాధించలేదు. జనసేన నేత పవన్‌కల్యాణ్‌ రాత్రి ఒకరు.. పగలు మరొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. మాటమీద నిలకడలేని వ్యక్తి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు’’ అని మండిపడ్డారు.

ముమ్మాటికీ తప్పుడు కేసులే..
జగన్‌పై వేసినవి ముమ్మాటికీ తప్పుడు కేసులేనని సజ్జల స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ ముందే మాట్లాడుకుని పిటిషన్‌ వేశాయన్నారు. ‘‘అధిష్టానం చెబితేనే చేశామని కాంగ్రెస్‌ నాయకులే చెప్పారు. బీజేపీ నాయకులూ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు. జగన్‌పై వేసినవి తప్పుడు కేసులనడానికి ఇంతకన్నా ఆధారాలు కావాలా? జగన్‌ బెయిల్‌ రద్దవుతుందని ఆర్నెల్లుగా చెబుతున్నారు. ఒకాయన పిటిషన్‌ వేసినట్టు ప్రచారం చేసుకుంటున్నాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, వాళ్లు చెబితే న్యాయస్థానం బెయిల్‌ రద్దు చేస్తుందని బీజేపీ నేతలు చెప్పాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు. అక్రమంగా జైలుకు పంపినప్పుడే వైఎస్‌ జగన్‌ చలించలేదన్నారు. జగన్‌ కుటుంబాన్ని చులకన చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన తలకిందులుగా తపస్సు చేస్తున్నాయని, ఇది కల్ల అని స్పష్టం చేశారు. ఇవన్నీ ఆధారాల్లేని కేసులని, త్వరగా పరిష్కరించాలని జగన్‌ కోరుకుంటున్నారని తెలిపారు. ఆయనపై పెట్టినవి తప్పుడు కేసులు కాబట్టే ప్రజలు ఆయన్ను ఆదరిస్తున్నారన్నారు.

ఇది టీడీపీ, నిమ్మగడ్డ కుట్రే..
పరిషత్‌ ఎన్నికలపై కేసుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రపూరిత ఎత్తుగడ ఉందని సజ్జల పేర్కొన్నారు. గత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ టీడీపీకి ఏజెంట్‌గా వ్యవహరించారని, ప్రభుత్వ వాదన పట్టించుకోకుండా, దురుద్దేశపూర్వకంగానే ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసి కోర్టు వ్యాజ్యాలకు అవకాశమిచ్చారని తెలిపారు. ‘‘కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికలు త్వరగా ముగించి, వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడే పరిషత్‌ ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీకి లేఖ కూడా రాసింది. వాస్తవానికి ఆయన అప్పుడే ఎన్నికలు నిర్వహించే వీలుంది. కానీ టీడీపీ కోసమే కోడ్‌ ఎత్తివేశారు’’ అని చెప్పారు. 

కుట్ర కోణం..
బీజేపీ, జనసేన, టీడీపీ బహిరంగంగానో... లోపాయికారిగానో జట్టుకట్టి ఏదో చేయాలనుకుంటున్నాయని సజ్జల అన్నారు. దీనివెనుక చంద్రబాబో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న కీలకమైన వ్యక్తులో, బీజేపీలో ఉన్న చంద్రబాబు ఏజెంట్లో ఉండొచ్చునని, అందుకే వరుసగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను ఎదుర్కోవాలంటే కలసికట్టుగా ఉండాలనే నీచ రాజకీయం చేస్తున్నారన్నారు. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించినప్పుడే చంద్రబాబు రాజకీయంగా మృతిచెందాడన్నారు. పెంటకుప్పల్లో దొర్లుతూ ఇదే రాజకీయమని టీడీపీ భావిస్తోందని, కానీ జనం దీన్ని ఆమోదించట్లేదన్నారు. వివేకానందరెడ్డి, జగన్‌ కుటుంబాల మధ్య సత్సంబంధాలున్నాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో జగన్‌ను మానసికంగా కుంగదీయాలని, ఆయన వెంట ఉండేవాళ్లను భయపెట్టాలనే వివేకాను హత్య చేశారనేది నిజమన్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌ మీద నిందలేయడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. ఈ కేసునే కాదు... తనపై జరిగిన హత్యాయత్నాన్ని జగన్‌ రాజకీయంగా వాడుకోలేదన్నారు. అలా చేస్తే చంద్రబాబునే ఏ–1గా పెట్టాలన్నారు. చట్టం తన పని తాను చేస్తుందనే నమ్మకం జగన్‌దన్నారు.  

మరిన్ని వార్తలు