‘రెడీ అనడమే తప్ప.. ఏవీ టీడీపీ రాజీనామాలు?’ 

24 Jul, 2021 16:20 IST|Sakshi

చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలి

వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ‘రాజీనామాలకు మేము రెడీ రెడీ అనడమే తప్ప.. టీడీపీ రాజీనామా చేసేది లేదని’ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. ‘‘గతంలో ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామాలు చేశారు. టీడీపీ హయాంలో 100 మందికి పైగా సలహాదారులు ఉన్నారు. కన్సల్టెన్సీ పేరుతో మారో 200 మందిని నియమించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసింది చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు. పరకాల, కుటుంబరావు రాజకీయాలు తప్ప వేరే ఏమి మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు.

‘‘మేము ముందు నుండి రాజకీయంగా ఉన్నాం. నేను పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఉన్నా. అమరావతిలో ఎలాంటి భూ కుంభకోణం జరిగిందో ప్రజలకి తెలుసు. అమరావతి అంటేనే పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణం. సాంకేతిక అంశాల వల్ల కోర్టు రిజెక్టు చేసి ఉండొచ్చు. అమరావతిలో ఇంకా చాలా అవకతవకలు ఉన్నాయి. ఏదొక కేసులో నిజాలు బయటకి వస్తాయి. పేరు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్ కాకపోవచ్చు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారు. రాష్ట్రం కోరుతున్న డిమాండ్ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని’’ సజ్జల అన్నారు.

రఘురామకృష్ణం రాజు కేసులో సీఐడీ ప్రస్తావించిన విషయం నిజం అని ప్రజలకి తెలుసునని, స్క్రీన్‌పై రఘురామ ఉంటే, ఆఫ్  స్క్రీన్ పై చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ఆయన మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టడానికి కుట్ర చేశారని, ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కూడా ఆధారాలు ఉన్నాయన్నారు. న్యాయమూర్తులపై కూడా కామెంట్లు చేశారని తెలుస్తోందని, కోర్టులు సుమోటోగా తీసుకుని విచారించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు