బాబు రైతుల్ని దారుణంగా మోసగించారు 

9 Sep, 2021 04:45 IST|Sakshi
రైతు భరోసా కేంద్రాలకు ట్రాక్టర్‌ తాళంచెవులను అందజేస్తున్న సజ్జల, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు

రూ.లక్ష కోట్ల రుణమాఫీ అని చెప్పిన బాబు రూ.12,700 కోట్లే ఇచ్చారు 

వైఎస్‌ జగన్‌ ప్రతి రైతుకు ఐదేళ్లలో రూ.67,500 చొప్పున ఇస్తున్నారు 

ఆర్బీకేలకు ట్రాక్టర్ల వితరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

అక్టోబర్‌ 1 నుంచి డ్రిప్‌ పరికరాలు అందిస్తాం: మంత్రి కన్నబాబు

ప్రొద్దుటూరు:  రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు వారిని దారుణంగా మోసగించారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన సొంత నిధులు రూ.1.71 కోట్లతో కొనుగోలు చేసిన 23 ట్రాక్టర్లను వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు బుధవారం అప్పగించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు.

అప్పట్లో రైతులు బకాయిపడిన రుణాలు రూ.87 వేల కోట్లు కాగా.. వడ్డీలతో కలిపి దాదాపు రూ.లక్ష కోట్లు ఉండేదని గుర్తు చేశారు. చంద్రబాబు ఆ మొత్తాన్ని వడపోసి చివరకు రూ.12,700 కోట్లను మాత్రమే రైతులకు చెల్లించారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఐదేళ్లలో రూ.67,500 చొప్పున అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారని తెలిపారు. ప్రజల ఆర్థిక స్వావలంబన కోసమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే అయితే ఇంత కష్టపడి పథకాలను అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు.  

అక్టోబర్‌ 1 నుంచి డ్రిప్‌ పరికరాలు అందిస్తాం 
వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో 50 వేల ఎకరాలను సాగు చేసుకునేందుకు వీలుగా ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి ఈ ట్రాక్టర్లను సమకూర్చారని తెలిపారు. డ్రిప్‌ పరికరాల కొనుగోలుకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. రూ.1,200 కోట్లతో పరికరాల కొనుగోలుకు రివర్స్‌ టెండరింగ్‌ ఇచ్చామని, ఈనెల 15వ తేదీలోపు టెండర్లు పూర్తి చేసి డ్రిప్‌ పరికరాలను అక్టోబర్‌ 1నుంచి అందిస్తామని చెప్పారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. రూ.480 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు సీఎం జగన్‌ దసరా సందర్భంగా ప్రొద్దుటూరుకు వస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.  

మాజీ ఎమ్మెల్యే ఎంవీఆర్‌కు పరామర్శ 
మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. లింగాపురంలోని ఎంవీఆర్‌ ఇంటికి వెళ్లిన సజ్జల ఆయన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.   

మరిన్ని వార్తలు