రాష్ట్రాన్ని ముంచేసింది చంద్రబాబే

22 Sep, 2021 04:07 IST|Sakshi

సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబును నమ్మి తొలిసారి అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పుల పాలు చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబు హయాంలో కేవలం 35 లక్షల మందికి పింఛన్లు ఇస్తే నేడు సీఎం జగన్‌ 60 లక్షల మందికి ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో పింఛన్లకు నెలకు రూ.500 కోట్లు కేటాయించేవారని, నేడు రూ.1400 కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ముస్లిం సంచార జాతుల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు దాదాపు రూ.3 లక్షల కోట్ల మేర అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారని చెప్పారు.

నేడు సీఎం జగన్‌ దాదాపు లక్షకోట్ల మేర వివిధ పథకాల కింద ప్రత్యక్షంగా ప్రజల ఖాతాల్లోకి వేశారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో దోపిడీ సాగితే సీఎం జగన్‌ హయంలో అంతా పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఆసిఫా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా, రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ బద్వేలు షేక్‌ గౌస్‌లాజాం, అత్యంత వెనకబడిన జాతుల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెండ్ర వీరన్న, పార్టీ బీసీ విభాగం రాయలసీమ రీజియన్‌ సమన్వయకర్త తొండమల్ల పుల్లయ్య, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్‌ డైరెక్టర్లు, ముస్లిం సంచార జాతుల కులసంఘ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు