అప్పట్లో అదనపు పన్నులు విధించి ఇప్పుడు ఆందోళనలా!

4 Aug, 2021 03:49 IST|Sakshi

నాడు చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రో ధరలు పెరిగాయి 

డీజిల్‌ ధరలు పెరిగాయంటూ రెండేళ్లలో నాలుగుసార్లు ఆర్టీసీ చార్జీలూ వడ్డన  

పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగినా ఆర్టీసీ ఛార్జీలు పెంచని సీఎం వైఎస్‌ జగన్‌ 

ఏ మొహం పెట్టుకుని ధర్నాలు చేస్తారు 

ఐదేళ్లలో రోడ్లను చంద్రబాబు అసలు పట్టించుకోలేదు 

ఇప్పుడు భారీ వర్షాలతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి 

కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి దారుణంగా మారింది 

అయినా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఆపలేదు 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: ఎలాంటి కారణాలు చూపకుండానే 2015 ఫిబ్రవరిలో పెట్రోల్‌పై లీటరుకు రూ.4 చొప్పున అదనపు పన్ను విధించిన చంద్రబాబు అప్పట్లో అన్ని ధరలనూ పెంచేశారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో ధరల్ని పెంచినందుకు సంజాయిషీ ఇవ్వాల్సిందిపోయి పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. 

పెట్రోల్‌ ధర 2018లోనే 86 దాటింది 
రాష్ట్రంలో 2014 జూన్‌లో రూ.73 ఉన్న పెట్రోల్‌ ధర.. 2018 సెప్టెంబర్‌ నాటికే రూ.86 దాటింది. డీజిల్‌ అయితే రూ.62 నుంచి రూ.80కి పెరిగింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను ఎక్కడా తగ్గించింది లేదు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి.. అంటే 2019 ఏప్రిల్‌ నాటికి రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.87.24 కు చేరింది. పెట్రో ధరలు పెరిగాయనే సాకు చూపి 2015 అక్టోబర్‌లో, 2015 డిసెంబర్‌లో, 2016 జూన్‌లో, 2017 జూలైలో కలిపి కేవలం  రెండేళ్లలో చంద్రబాబు నాలుగు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను అడ్డగోలుగా దోచేసి.. రాసి రంపాన పెట్టారు.
 
ప్రజలపై భారం వేయలేదు 
కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం రూ.30 వేల కోట్లు తగ్గింది. కరోనా  సమయంలో నిరుపేదలను ఆదుకోవడం కోసం రూ.30 వేల కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఖర్చు చేశారు. మొత్తమ్మీద ప్రభుత్వంపై రూ.60 వేల కోట్ల భారం పడినా ప్రజలపై ఎలాంటి భారం వేసేలా ధరలు పెంచలేదు. విభజన సమయంలో రాష్ట్ర వాటాగా వచ్చిన రూ.90 వేల కోట్ల రుణాన్ని.. ఎడాపెడా అప్పులతో దోపిడీ చేసి దాన్ని రూ.3.60 లక్షల కోట్లకు పెంచేసి చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్‌ సర్కార్‌ను విమర్శించే నైతిక హక్కు, అర్హత చంద్రబాబుకు లేవు.  

ఏనాడైనా రోడ్లను పట్టించుకున్నారా 
టీడీపీ హయాంలో ఐదేళ్లలో రోడ్లను ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లోనే రోడ్లు గోతులు, గుంతలమయంగా మారిపోయాయి. రెండేళ్లుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల ఆ రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లను ప్రజలకు ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దడానికే పెట్రోల్‌ లీటర్‌పై ఇటీవల రూ.1ను ప్రభుత్వం పెంచింది. చంద్రబాబు తరహాలో పెట్రోల్‌ ధరలను చూపి.. ఆర్టీసీ చార్జీలను సీఎం వైఎస్‌ జగన్‌ పెంచలేదు. అమరరాజా బ్యాటరీ కంపెనీ తరలిపోతోందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కలత చెందుతూ కథనాలు రాశారు. ఆ పరిశ్రమపై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదు. పరిశ్రమలు రావాలి. అయితే అవి ప్రజారోగ్యానికి, పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలి. ఇది సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పం. 

మరిన్ని వార్తలు