చంద్రబాబు పేరు చెబితేనే ప్రజలు భగ్గుమంటున్నారు

26 Aug, 2020 05:02 IST|Sakshi

రాజకీయంగా ఆయన చివరి దశలో ఉన్నారు 

ఆయన మీడియాలు పెట్టే పోల్స్‌లో ఫలితాలెలా వస్తాయో తెలుసు 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగి 14 నెలలు కూడా ముగియలేదని, ప్రతిపక్ష నేత చంద్రబాబు గెలిచిన ఆ 23 చోట్ల కూడా బాబు పేరు చెబితే ప్రజలు భగ్గుమంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అలాంటి చంద్రబాబు అమరావతి పేరు మీద దొంగపోల్స్‌ పెడుతున్నారని మండిపడ్డారు. బాబే జీవితంగా, చంద్రబాబే సర్వస్వంగా భావించే టీవీలు, పేపర్లు, వెబ్‌సైట్లలో పెట్టే పోల్స్‌లో ఫలితాలెలా వస్తాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సజ్జల చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు.

14 నెలల ముందు వరకు అధికారంలో ఉండి ప్రజలపట్ల ఆయనెలా వ్యవహరించారో చంద్రబాబు మరిచిపోయారని.. అలాగే, రాష్ట్రంలోని ప్రజలు కూడా అన్ని మరిచిపోయారని చంద్రబాబు భావించడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు రాజకీయాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించే విజ్ఞానవంతులనే విషయం చంద్రబాబుకు గుర్తులేదన్నారు. బాబు దొంగ పోల్స్, డ్రామాలు ప్రజలకు తెలుసునన్నారు. ప్రజలను తన ఎత్తుగడలతో, ఎల్లో మీడియా అండతో భ్రమల్లోకి తీసుకువెళ్లగలనని చంద్రబాబు భావిస్తున్నాడని తెలిపారు. బాబు తన దుష్టపన్నాగాల నుంచి ఇప్పటికైనా బయటకు రావాలన్నారు.

పైశాచిక ఎత్తుగడలు మానేయాలి 
రాజకీయంగా చివరి దశలో ఉన్న చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. ఈ పైశాచిక ఎత్తుగడలు మానేయాలని సజ్జల హితవు పలికారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని∙చెప్పుకునే బాబు ఇప్పటికైనా, వయస్సు రీత్యానైనా కుళ్లు కుతంత్రాలు విడిచిపెట్టాలని చెప్పారు. చంద్రబాబు గోబెల్స్‌ మాదిరిగా అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేసినా, తన అసత్యాలతో ప్రజల్లో అయోమయాన్ని సృష్టించాలనుకున్నా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. బాబు తన అనుకూల ఎల్లో మీడియాతో కల్లబొల్లి కథనాలు వండి వార్చే పద్ధతులు వదిలేయాలని హితవు పలికారు. విశాఖ, కర్నూలు నగరాలపై ద్వేషాన్ని చిమ్మవద్దని.. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతివ్వాలని సజ్జల కోరారు.   

మరిన్ని వార్తలు