బాబూ ఓటమిని హుందాగా ఒప్పుకో

11 Feb, 2021 04:08 IST|Sakshi

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల ధ్వజం 

పరాజయంపై సంబరాలు చేసుకోవడం ఏమిటి? 

తప్పుదారి పట్టించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు 

‘పంచాయతీ’లో 81 శాతం వైఎస్సార్‌సీపీ అభిమానులే నెగ్గారు 

అచ్చెన్న, యనమల, ఉమా ఇలాఖాలోనూ జగన్‌ వెంటే జనం 

విజేతలు ఏ పార్టీ అభిమానులో వెబ్‌సైట్‌లోనే వెల్లడిస్తాం 

కాదని చెప్పగలిగే సత్తా బాబుకు ఉందా?  

సాక్షి, అమరావతి: టీడీపీ, ఎన్నికల కమిషనర్‌ కలసి ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైపే ఉన్నారని మరోసారి రుజువైందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ సానుభూతిపరులు 81 శాతం మంది విజయం సాధించారని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలని వ్యాఖ్యానించారు. ఫలితాలు ఏకపక్షంగా ఉన్నా ఎల్లో మీడియా వక్రీకరించడం, ఓటమిని టీడీపీ నేతలు సంబరాలుగా చిత్రీకరించుకోవడం దిగజారుడుతనమేనన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఎల్లో మీడియా అసత్య కథనాలు.. 
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికార పార్టీని ప్రజలు ఈ స్థాయిలో గెలిపించడం బహుశా ఇప్పుడే కావచ్చు. కానీ ఎల్లో మీడియా ఓడిపోయిన టీడీపీకి అనుకూలంగా అసత్య కథనాలు రాసింది. మంగళవారం రాత్రే ఎన్నికల ఫలితాలు వచ్చినా ఈనాడు పత్రిక ‘పోటెత్తిన ఓటర్లు’అంటూ పక్కదారి పట్టించే కథనం ఇచ్చింది. ప్రాణాలొడ్డి గెలిచామన్న టీడీపీ నేత ప్రకటన వేసింది. ఆయన చెప్పిన తప్పుడు అంకెలను ప్రచురించింది. ఆంధ్రజ్యోతి వార్తలు మరీ ఘోరం. ‘ధీటుగా పోటీ’అంటూ టీడీపీకి పట్టుందనే భ్రమ కల్పించారు. టీడీపీ 38.74 శాతం విజయం సాధించినట్లు కరపత్రం, సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు.  చదవండి: (రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం)

టీడీపీని ఛీకొట్టిన ప్రజలు.. 
రాష్ట్రం మొత్తం ఛీకొట్టినా చంద్రబాబు, టీడీపీ నేతలు ఇంకా అవాస్తవాలే చెబుతున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహించే టెక్కలిలో 135 పంచాయతీలకుగానూ వైఎస్సార్‌ సీపీ 112 గెలుచుకుంది. యనమల ఇలాకా తునిలో 58కిగానూ వైఎస్సార్‌సీపీకి 54 వచ్చాయి. దేవినేని ఉమ ఉండే ప్రాంతంలో 48కిగానూ 44 పంచాయతీలు మావే. రాజధాని మారుస్తున్నారని, జగన్‌ను వ్యతిరేకిస్తున్నారని టీడీపీ దు్రష్పచారం చేసినా నగరం నడిరోడ్డు(మైలవరం)లో ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారు. యావత్‌ రాష్ట్రం ఫలితాలు ఇలా ఉంటే టీడీపీ నాయకులు గోచీని తలకు చుట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. విజయం సాధించిన వారు ఏ పార్టీ అభిమానులో అన్ని వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం. టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇది నిజం కాదని రుజువు చేయగలదా?  

నిమ్మగడ్డ సొంతూరులోనూ విజయభేరీ.. 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం సానుకూలత లేకుండా చేయాలనుకున్నారు. గతంలో మధ్యలో ఆపేసిన ఎన్నికలను పట్టించుకోకుండా పంచాయతీ ఎన్నికలు ముందుకు తెచ్చారు. ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయంటూ కడప, అనంతపురంలో పూనకం వచ్చినట్లు ప్రవర్తించారు. ఆయన ఎంత అడ్డుకున్నా గతంలో 13 శాతం అయ్యే ఏకగ్రీవాలు ఇప్పుడు 16 శాతం అయ్యాయి. ఆఖరుకు నిమ్మగడ్డ స్వగ్రామం దుగ్గిరాలలో 16 వార్డులకుగానూ 11 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులే గెలిచారు. మా పార్టీ సానుభూతి పరురాలు సర్పంచ్‌గా 1,165 ఓట్లతో గెలిచారు. విప్లవ వీరుడిలా వీరంగం వేసిన నిమ్మగడ్డ ఈ ఫలితానికి ఏం చెబుతారో? ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరాం. టీడీపీ చెప్పుకుంటున్నట్లుగా భయపడి కాదు. చదవండి: (టీడీపీ కంచు కోటలకు తూట్లు)

రాజకీయాల్లో జగన్‌ ముద్ర 
ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చారు. మెరుగైన, అవినీతి రహిత పాలనపై దృష్టి పెట్టారు. వ్యవస్థల్లో మార్పులు తెచ్చారు. ఎన్నో పథకాలు తెచ్చారు. దీర్ఘకాలిక సంస్కరణలతో ప్రజల జీవితాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. కాబట్టే ఫలితాలు వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా ఉంటాయనేది సుస్పష్టం. చంద్రబాబు దీన్ని గుర్తించాలి. రాజకీయం ప్రజలకు సంబంధించిందని చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదు. ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో లోపాలుంటే మాట్లాడాలి. నిర్మాణాత్మక విమర్శలు చేయాలి. తప్పుడు దారిలో అవాస్తవాలు ప్రచారం చేస్తే ఫలితాలు పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఉంటాయి. మరో 40 నెలల్లో ప్రజలకు ఏం చేయాలో సీఎం జగన్‌కు స్పష్టత ఉంది. ఇంతకన్నా మెరుగైనది చేస్తామని చంద్రబాబు చెప్పుకోవాలి. ఓటమిని హుందాగా ఒప్పుకోవాలి. వెకిలిగా ప్రవర్తించొద్దు. వ్యవస్థలను మాయ చేసి అడ్డదారిలో వెళ్లడం సరికాదు. ప్రజలు మిమ్మల్ని నమ్మరు.  

>
మరిన్ని వార్తలు