చంద్రబాబు కుట్ర బట్టబయలు 

11 May, 2021 03:39 IST|Sakshi

సుప్రీంలో కేంద్రం అఫిడవిట్టే ఆధారం.. వ్యాక్సిన్‌ కంట్రోల్‌ తమ చేతుల్లోనే అన్న కేంద్రం 

వాస్తవాన్ని వక్రీకరించి విపక్షనేత విషప్రచారం.. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద తాకిడికి బాబే కారణం 

కోవిడ్‌ వ్యాప్తితో సామూహిక మరణాలకు కుట్ర.. కష్టకాలంలోనూ చంద్రబాబు చెత్త రాజకీయం 

వ్యాక్సిన్‌ కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడని జగన్‌ 

ప్రభుత్వ సలహాదారు సజ్జల 

సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సిన్, ఆక్సిజన్, మందుల సరఫరాపై విపక్షనేత చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి కుట్రపూరితంగా విషప్రచారం చేస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌తో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీపై సర్వాధికారాలు కేంద్రానివేనని ఆ అఫిడవిట్‌లో ఉందని చెప్పారు. అలాంటప్పుడు వ్యాక్సిన్‌ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు చెప్పడం అసత్య ప్రచారం కాదా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల పంపిణీ కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ ద్వారానే జరుగుతున్నాయని కేంద్రమే ఒప్పుకొందని చెప్పారు. చంద్రబాబు మాత్రం ప్రభుత్వం వీటికి డబ్బులు కేటాయించలేదని దు్రష్పచారం చేస్తున్నాడని, ఇలా భయపెట్టడం వల్లే వ్యాక్సినేషన్‌ సెంటర్లకు జనం పెద్దఎత్తున పోగవుతూ కోవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ అనుకూల మీడియా ప్రజలను రెచ్చగొట్టి రోడ్లమీదకొచ్చే పరిస్థితి తీసుకొస్తోందన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ పచ్చ గుంపునకు ఏ శిక్ష వేయాలని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..  

అనుక్షణం జనం కోసమే జగన్‌ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంటిపెద్దలా వ్యవహరిస్తున్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయికి పరుగులు పెట్టిస్తున్నారు. వ్యాక్సిన్‌ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచారు. ఆక్సిజన్‌ సరఫరా, ఆస్పత్రుల్లో బెడ్లు పెంచడం, డాక్టర్లు, సిబ్బందిని నియమించడం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ డీ లైసెన్సింగ్‌ చేసేందుకు వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీవో)లోనూ చర్చలు జరుగుతున్నాయి. భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ పేటెంట్‌పై కేంద్రానికి కూడా హక్కుంది. భారత్‌ బయోటెక్‌ పేటెంట్‌ను డీ లైసెన్సింగ్‌ చేసి ఉత్పత్తి పెంచేందుకు.. కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ కూడా రాస్తారు. చంద్రబాబు మాత్రం.. జూమ్‌లో ప్రజలను రెచ్చగొడుతున్నాడు. చేతనైతే రామోజీరావు బంధువు భారత్‌ బయోటెక్‌ నుంచి వ్యాక్సిన్‌ ఇప్పించవచ్చు కదా.   

ప్రజల ప్రాణాలే ముఖ్యం 
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైఎస్‌ జగన్‌ చేస్తున్న కృషిని విపక్షనేత చంద్రబాబు అభినందించాలి. జగన్‌.. కోవిడ్‌ను కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చి, పేదలకు వైద్యం అందిస్తున్నారు. 104 వాహనాల ద్వారా 24 గంటల వైద్యం అందుతోంది. 10 వేల నుంచి 15 వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ పెంచి, 16 వేల నుంచి 20 వేలమందికి పైగా డాక్టర్లను, సిబ్బందిని రిక్రూట్‌ చేసి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చిత్తశుద్ధిగా కృషిచేస్తున్నారు. కేంద్రం వ్యాక్సిన్‌ ఇస్తే రోజుకు 6 లక్షల డోస్‌లివ్వగల సామర్థ్యం రాష్ట్రానికి ఉండేలా జగన్‌ చేశారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను రిస్క్‌ ఎక్కువగా ఉండే 45–60 ఏళ్ల వాళ్లకు ముందుగా వేస్తున్నారు. 18–45 ఏళ్ల వారికి ఎందుకు వేయరంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా రాజకీయం చేయడం దుర్మార్గం. చంద్రబాబు, లోకేష్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారా? వ్యాక్సిన్‌ వేయాల్సి వస్తే లోకేష్‌ ముందుగా తన తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇవ్వడా? అలాకాకుండా ఆయనే వేయించుకుంటాడా? ఒకవేళ 45 ఏళ్లలోపు వయసు ఉన్న తను  దొడ్డిదారిన వ్యాక్సిన్‌  వేసుకున్నా అది తప్పే కదా? చంద్రబాబు విషపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన పెంపకంలో పెరిగిన కొడుకూ అంతే. చివరకు టీడీపీ నేతలు, అనుకూల మీడియాదీ విషపు ఆలోచనలే. మురికిగుంటలో మాత్రమే శ్వాస పీల్చగలిగే క్రిమి తెగకు చెందిన వ్యక్తి చంద్రబాబు. కేంద్రం నియంత్రణలో ఉన్న వ్యాక్సినేషన్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దురుద్దేశాలు ఆపాదించి విమర్శలు చేయడం ఏమిటి? నోరు తెరిస్తే చంద్రబాబు, ఆయన కొడుకు.. జగన్‌రెడ్డి అనడం న్యాయమేనా? మేం కూడా ఆయనను బాబునాయుడు అని పిలిస్తే..? 

కేసులు పెట్టండి.. నిలదీయండి 
చంద్రబాబు వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయాలని చూస్తున్నాడు. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద జనం తాకిడి ఉంది. ఇది దేశద్రోహం, రాజద్రోహం. కోవిడ్‌ వ్యాప్తికి కారణమై, మాస్‌ మర్డర్స్‌ వైపు చంద్రబాబు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. వీటిమీద ఎక్కడికక్కడ కేసులు పెట్టండి, నిలదీయండి. సమాజం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న కొన్ని మీడియా సంస్థలపై కేసులు పెడతాం. విజ్ఞులు, మేధావులు, పౌర సమాజం కూడా చంద్రబాబు కుట్రలను ప్రశ్నించాలి.   

మరిన్ని వార్తలు