సీఎం జగన్‌పై పెరుగుతున్న ఆదరాభిమానాలు

15 Sep, 2021 03:33 IST|Sakshi

కురుబ, కురుమ కులస్తుల ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల

సాక్షి, అమరావతి: బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో సీఎం వైఎస్‌ జగన్‌పై ఆదరాభిమానాలు పెరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కురుబ, కురుమ కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌ బాబు అధ్యక్షత వహించారు. సజ్జల మాట్లాడుతూ.. విద్యుత్‌ పంపిణీ సంస్థలు వసూలు చేయాలని నిర్ణయించిన ట్రూ అప్‌ చార్జీల భారానికి గత చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని  ధ్వజమెత్తారు.

చంద్రబాబు అస్తవ్యస్త విధానాల వల్లే విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. వాటిని అధిగమించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.  వాస్తవాలు ఇలా ఉండగా.. పచ్చ మీడియా టీడీపీతో కుమ్మక్కై దుష్ప్రచారం చేస్తోందన్నారు. రైతులు రుణగ్రస్తులయ్యారని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమనేలా పచ్చ మీడియా ఇటీవల ఒక కథనం ప్రచురించిందన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించడమే దీని లక్ష్యమన్నారు. 2014–2019 మధ్య చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలతోనే రైతులు అప్పులపాలయ్యారన్నారు. పింఛన్లు తొలగిస్తున్నారంటూ అసత్య కథనాలు ప్రచురిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ మంత్రులు చెల్లుబోయిన, మాలగుండ్ల శంకరనారాయణ, ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు.. లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, కురబ కార్పొరేషన్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు