చంద్రబాబు, పవన్‌లను నిలదీయండి

11 Nov, 2022 04:10 IST|Sakshi

ప్రజలకు సజ్జల పిలుపు 

మూడు సెంట్లలో ఇల్లు నిర్మిస్తానన్న బాబు హామీ ఏమైంది? 

31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కన్పించడం లేదా? 

విజయసాయిరెడ్డికి ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు ఏమిటి సంబంధం?

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య ప్రజలను మోసం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌తో కలిసి మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని, వారిని ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు ఐదేళ్లలో ఏ ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం ఇవ్వకపోవడంపై పవన్‌ కళ్యాణ్‌ ఏనాడైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేలా, నేడు చీలకుండా చూసేలా పవన్‌ ఆడిన, ఆడుతున్న డ్రామాలు చంద్రబాబు కోసమేనని మండిపడ్డారు.

ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన వారి ఇళ్లను, ప్రహరీలను కూల్చకున్నప్పటికీ కూల్చినట్లు.. చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పటంకు నారా లోకేశ్‌ వెళ్లారు. ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు వెళ్లినా వెళ్లొచ్చు’ అని అన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. 

ఇళ్లు, ఇంటి స్థలాలు కన్పించడం లేదా?  
► 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98 శాతం హామీలను ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. 87 శాతం కుటుంబాలకు డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) కింద రూ.1.80 లక్షల కోట్లు పంపిణీ చేశారు. తన 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.71 వేల కోట్ల విలువైన ఇంటి స్థలాలను ఇచ్చారు.  

► 21 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడితే.. అందులో జగనన్న కాలనీల్లోనే 15.60 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు. 3 లక్షల ఇళ్లు సీలింగ్‌ వరకు వచ్చాయి. ఇప్పుడు జగనన్న కాలనీల్లో పవన్‌ సోషల్‌ ఆడిట్‌ చేస్తాడట! జగనన్న కాలనీలు చూడాలంటే గడప గడపకు వెళుతున్న మా ఎమ్మెల్యేలతో పాటు మీరూ వెళ్లండి. ప్రతి ఇంటికి ఏమేమి పథకాలు అందుతున్నాయో తెలుసుకోండి.

లిక్కర్‌ స్కాంతో మాకు సంబంధం లేదు
► ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో మాకు, ప్రభుత్వానికి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి ఏం సంబంధం? ఆ స్కాంలో  విజయసాయిరెడ్డి అల్లుడు అన్న పేరు బయటకు వచ్చినంత మాత్రాన మోకాలికి, బోడి గుండుకు ముడి పెట్టడం సమంజసం కాదు. లేనిది ఉన్నట్టుగా ఎల్లో మీడియాలో ప్రచారం చేసి, విత్తనం నుంచి వాళ్లే లీకులు ఇస్తూ.. మళ్లీ మేం ముందు చెప్పినట్టే జరుగుతుందని వాళ్లే మాట్లాడడం, రాతలు రాయడం వాళ్ల నైజం.  

► 2000లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరబిందో సంస్థకు చెందిన ఆంధ్రా ఆర్గానిక్‌ లిమిటెడ్‌లో.. చంద్రబాబు కూడా పార్ట్‌నర్‌. మరి చంద్రబాబుకు కూడా లిక్కర్‌ స్కాంతో లింకు ఉందా? 

► యోగి వేమన విశ్వవిద్యాలయం లోపల ఉన్న వేమన విగ్రహాన్ని, అందంగా తీర్చిదిద్దిన ముఖద్వారం వద్ద పెట్టి.. మరింత ప్రాముఖ్యతను ఇస్తే.. దానిని కూడా వక్రీకరిస్తూ అడ్డగోలు కథనాలు రాయడం ఎల్లో మీడియా దిగజారుడుతనానికి పరాకాష్ట. 

మరిన్ని వార్తలు