మహనీయుల స్ఫూర్తితో సీఎం పాలన

3 Oct, 2021 03:52 IST|Sakshi
గాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బాపూజీ, లాల్‌ బహదూర్‌శాస్త్రి జయంతి నివాళులర్పించిన నేతలు

సాక్షి, అమరావతి: మహనీయుల అడుగు జాడల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగుతున్నారని, వారిచ్చిన స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్‌ తన పాలనలో గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెడుతుండటాన్ని మనం చూస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సజ్జలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరై బాపూజీ, లాల్‌బహదూర్‌శాస్త్రిల చిత్రపటాలకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రిలు దేశానికి లభించిన ఆణిముత్యాలన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ప్రసంగించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.   

ఒక్క రోడ్డు కూడా వేయని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు పవన్‌?  
కోవిడ్‌ నిబంధనలు అందరికీ సమానమేనని, ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలని.. అంతేగానీ పవన్‌ టూర్‌ను ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి సీఎం జగన్‌ రూ.2,200 కోట్లు కేటాయించారని, వర్షాలు తగ్గగానే నవంబర్‌లో రోడ్లకు మరమ్మతులు చేస్తామని సీఎం చెప్పారని, ఈ లోపు టెండర్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని, ఆనాడు పవన్‌ ఏమయ్యారని, చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని, అప్పుడెందుకు శ్రమదానం చేయలేదని సజ్జల ప్రశ్నించారు. పవన్‌ ఎన్ని విధాలా రెచ్చగొట్టినా ఆయన మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఆయనలో ఈ ఫ్రస్ట్రేషన్‌కు ఎన్నికల్లో గెలవకపోవడమే కారణంగా కనిపిస్తోందన్నారు. అంతకుమించి.. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్‌పై ఈర‡్ష్య, ద్వేషం, అసూయ, అక్కసు కూడా పవన్‌ మాటల్లో, చేష్టల్లో కనిపిస్తున్నాయన్నారు.  

మరిన్ని వార్తలు