దశాబ్దాల కలలు రెండేళ్లలో సాకారం

31 May, 2021 04:10 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. చిత్రంలో మంత్రి బొత్స తదితరులు

సీఎం జగన్‌ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను చేరవేశారు: సజ్జల

90% మంది ప్రజల మనసులను గెలిచారు  

అన్ని వర్గాలకూ మేలు చేకూర్చారు

మహాత్ముడి గ్రామ స్వరాజ్యం ఆకాంక్షను నెరవేర్చారు

సాక్షి, అమరావతి: దశాబ్దాల కలలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెండేళ్లలోనే సాకారం చేసి సువర్ణ ఘట్టాలను నిక్షిప్తం చేశారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజల్ని నమ్ముకోవడమే జగన్‌ రాజకీయం కాగా వారిని వాడుకోవడం చంద్రబాబు రాజకీయమని వ్యాఖ్యానించారు. గత సర్కారు అప్పులు అప్పగించినా, ఏడాదిన్నరపైగా కరోనా ఆర్థిక వ్యవస్థను కుంగదీసినా సీఎం జగన్‌ పేదల సంక్షేమాన్ని విస్మరించలేదని చెప్పారు.

రెండేళ్లలోనే రాష్ట్రంలో 90 శాతం ప్రజల మనసులను గెలుచుకోవడం వైఎస్‌ జగన్‌కే సాధ్యమైందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

గ్రామ స్వరాజ్యం సాకారం..
సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్‌ నిజం చేశారు. ప్రజా సంక్షేమాన్ని ప్రతి ఇంటివద్దకు తీసుకెళ్లారు. 2.40 కోట్ల మంది ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకుంటే 2.33 కోట్ల అభ్యర్థనలకు (96 శాతం) పరిష్కారం లభించింది. నిర్ణీత గడువులోనే 87 శాతం పూర్తవ్వడం విశేషం. గతంలో ఎన్నడూ ఇలాంటి వ్యవస్థ లేదు. వైఎస్‌ జగన్‌ వాస్తవిక ఆలోచనల ఫలితంగానే పార్టీ క్యాడర్‌కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. 

రైతన్నకు అండగా..
రైతన్నలకు ఈ రెండేళ్లలో రూ.17 వేల కోట్లకుపైగా రైతు భరోసా కింద అందింది. ఆర్బీకేలు కేంద్రంగా వ్యవసాయం కొనసాగడం గొప్ప విప్లవం. గతంలో మాటలకే పరిమితమైన ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా, సున్నావడ్డీ సబ్సిడీని ఈ ప్రభుత్వం గడువులోగా చెల్లిస్తోంది. చంద్రబాబు రైతు రుణమాఫీ పేరుతో చేసిన మోసం వల్ల రైతులు దాదాపు రూ.2 లక్షల కోట్ల వరకూ నష్టపోయారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కని, కొట్లాడని రోజులున్నాయా? కానీ ఇప్పుడు సీఎం జగన్‌ రైతులకు ఇస్తానన్న సొమ్మును నిర్దేశిత సమయానికి అందిస్తున్నారు. ఏ సమయానికి ఏ పథకం సొమ్ము అందించాలో క్యాలెండర్‌ రూపొందించి స్వీయ పరీక్ష పెట్టుకుంటున్నారు. ఈరోజు కన్నా రేపు గొప్పగా ఉంటుందనే భరోసా ఉండాలి. దాన్నే అభివృద్ధి అని వైఎస్‌ జగన్‌ నమ్ముతారు. 

కార్పొరేట్‌కు దీటుగా విద్య
కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్‌ రెండేళ్లుగా పలు మార్పులు తెచ్చారు. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుని ప్రపంచంతో పోటీ పడాలన్నదే ఆయన తపన. పేద పిల్లల కోసం ఇంగ్లిష్‌ మీడియం చదువులకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ తమ జీవితంలో మార్పులు తెచ్చే సంస్కరణలని ప్రజలు గుర్తించాలి. ఇప్పుడున్న పాఠశాలలు చూసి గతంలో చదివిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.  

ఆరోగ్యశ్రీతో భరోసా
ఆరోగ్యశ్రీ వ్యవస్థను సమూలంగా మార్చారు. పథకం పరిధిలోకి వచ్చే వ్యాధుల సంఖ్య పెంచారు. గరిష్టంగా వార్షిక ఆదాయం రూ.5 లక్షలున్న వారిని అర్హులుగా ప్రకటించడంతో అత్యధిక కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. సూపర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో అంతర్జాతీయ స్థాయి వైద్యం ప్రజలకు అందుతుంది. రాయలసీమ కరువు నివారణకు కాల్వల వెడల్పునకు శ్రీకారం చుట్టడంతో పాటు సాగునీటి వ్యవస్థలో మార్పులు తెచ్చారు. ఫిషింగ్‌ హార్బర్లు, కొత్త పోర్టులు రాష్ట్రానికొస్తున్నాయి. తన తండ్రి కన్నా పది రెట్లు ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తూ వైఎస్‌ జగన్‌ మహాశక్తిగా ఎదిగారు. ప్రజలకు జవసత్వాలు పెరిగేలా చేశారు. 

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రెండేళ్ల పండగ
వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి, నేతలతో కలిసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పలువురు నేతలు ఒకరికొకరు అభినందనలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు