వైఎస్సార్‌ స్వప్నం పోలవరం.. జగన్‌ హయాంలో సాకారం

1 Jul, 2021 04:22 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు పనులను వ్యూ పాయింట్‌ నుంచి పరిశీలిస్తున్న బృందం

చంద్రబాబు మన జుట్టు కేంద్రం చేతుల్లో పెట్టారు

ఆయన నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతింది

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

పోలవరాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధుల బృందం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నం పోలవరం ప్రాజెక్టు ఆవిష్కృతం అవుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కోవిడ్‌ కష్టకాలంలోనూ దీక్షతో సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం పనులు చేయిస్తున్నారన్నారు. సజ్జల నేతృత్వంలో ప్రజాప్రతినిధుల బృందం బుధవారం ఈ ప్రాజెక్టును సందర్శించింది. స్పిల్‌వే పనులను, కాఫర్‌ డ్యాంలను పరిశీలించింది. అనంతరం మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2005లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సాకారం అవుతోందని చెప్పారు. జూన్‌ 12న పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గోదావరి జలాలు వెళ్లిన అద్భుత ఘట్టాన్ని ఆర్భాటాలకు తావులేకుండా నిర్వహించామన్నారు. గత ప్రభుత్వం 2014లో పోలవరం ప్రాజెక్టును కమీషన్లకు కక్కుర్తి పడకుండా చేపడితే 2018 నాటికి పూర్తయ్యేదని చెప్పారు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని కేంద్రం చేపట్టాల్సి ఉందని, చంద్రబాబునాయుడు కమీషన్లపై కక్కుర్తితో తానే చేపట్టారని విమర్శించారు. మన జుట్టు తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు. అనాలోచితంగా కాఫర్‌డ్యాంను ముందుగా చేపట్టడం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ పనులు ముందుకెళ్లాయని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఆ దిశలోనే పునరావాసం కూడా ముందుకు సాగుతోందన్నారు. ‘పునరావాసం కేంద్రమే చేయాల్సి ఉంటే రూ.23 వేల కోట్లకు ఒప్పుకొని వచ్చింది మీరేకదా.. ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలి..’ అని మాజీమంత్రి దేవినేని ఉమాకు హితవు పలికారు. ప్రజాప్రతినిధుల బృం దంలో ప్రభుత్వ విప్‌లు జి.శ్రీకాంత్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కోడుమూరి శ్రీనివాసులు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీ గంగు ల ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు,  గ్రంధి శ్రీనివాస్, కొఠారు అబ్బయ్యచౌదరి, కొట్టు సత్యనారాయణ, మొండితోక జగన్‌మోహనరావు, తలారి వెంకట్రావు, ఎన్‌.ధనలక్ష్మి, ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

జూలై నెలాఖరుకు 9,500 ఇళ్లు పూర్తి
అంతకుముందు ప్రాజెక్టును పరిశీలించిన ఈ బృందం సభ్యులు.. అధికారులతో ప్రాజెక్టు ప్రగతి, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు.  ప్రాజెక్టు దశలవారీ ప్రగతి, చేపట్టనున్న పనులను పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌ ఎం.సుధాకర్‌బాబు వివరించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక కమిషనర్‌ ఆనంద్‌ చెప్పారు. 5 ప్రభుత్వ శాఖల ద్వారా 12,941 ఇళ్ల నిర్మాణం జనవరిలో ప్రారంభించామన్నారు. జూన్‌ 30 నాటికి 6,169 ఇళ్లు పూర్తిచేశామని, జూలై నెలాఖరుకు 9,500 ఇళ్లు పూర్తిచేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. 2015, 2019, 2021ల్లో ప్రాజెక్టు పనుల పురోగతిని ఫొటోలతో వివరించారు. 

>
మరిన్ని వార్తలు