బీసీలకు రూ.69 వేల కోట్ల మేర లబ్ధి

25 Aug, 2021 03:35 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల

ఘనంగా అతిరాస కులస్తుల ఆత్మీయ సమావేశం 

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో బీసీలు టీడీపీకి దూరమైపోతున్నారన్న కడుపుమంటతో కొన్ని పత్రికలు విషం కక్కుతున్నాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి విష ప్రచారాలను బీసీలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీసీల్లో అట్టడుగున ఉన్న కులాలను సైతం ఉన్నత స్థానాలకు తీసుకురావడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమని తెలిపారు. బీసీలకు ఈ రెండున్నరేళ్ల కాలంలో రూ.69 వేల కోట్ల లబ్ధి చేకూర్చి.. వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దేనని చెప్పారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అతిరాస కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇళ్ల భాస్కరరావు అధ్యక్షతన అతిరాస కులస్తుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. అతిరాసలు, ఈ కార్పొరేషన్‌ కింద ఉన్న 20 ఉపకులాలు నివసించే ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి.. వారికి పథకాలు అందుతున్నాయో, లేదో తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు.. లేళ్ల అప్పిరెడ్డి, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, అతిరాస సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు