ఓటమికి ముందే కారణాలు

18 Apr, 2021 03:16 IST|Sakshi

పక్కా పథకంతోనే చంద్రబాబు దొంగ ఓట్ల నాటకం 

తన అనుకూల మీడియాతో కలసి తప్పుడు ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

తిరుపతికొచ్చే భక్తులను అవమానించారు

డిపాజిట్‌ కోసం కొట్లాడే టీడీపీ, బీజేపీకే దొంగ ఓట్ల అవసరం

వైఎస్సార్‌సీపీకి ఏం అవసరం?  

సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని తెలిసి చంద్రబాబు ముందే కారణాలు వెతుక్కుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో దొంగ ఓట్లు వేయిస్తోందని వైఎస్సార్‌సీపీపై అబద్ధపు ప్రచారం నెత్తికెత్తుకున్నారని మండిపడ్డారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంటే.. జగన్‌ పాలనకు సానుకూలంగా ఓటేయాలని ప్రజలు భావిస్తుంటే, చంద్రబాబు మాత్రం అబద్ధాల ప్రచారంతో తిరుపతిలో తన విశ్వరూపం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి అనుసరిస్తున్న విధానాల్నే ఇక్కడా అమలు చేశారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ బస్సుల్లో తిరుపతికి దొంగ ఓటర్లను తరలించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలను ఖండించారు.

పుణ్యక్షేత్రం కావడంతో రోజూ లక్షమంది భక్తులు తిరుపతికి వస్తుండటంతో చంద్రబాబు పక్కా వ్యూహంతోనే తన ఆరోపణలకు పదునుపెట్టారన్నారు. భక్తులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అనుకూల మీడియా చేసిన హడావుడిని ఖండించారు. ఆ బస్సుల్లోనే చంద్రబాబు తన మనుషులను పెట్టి.. తన అనుకూల మీడియాకు సానుకూలంగా చెప్పించారన్నారు. ఇదంతా పథకం ప్రకారం చేసిన కుట్ర అని స్పష్టం చేశారు. ‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో తన సొంత ఇంట్లో ఉన్నాడు. ఇదీ తప్పేనా? టీడీపీ ఆరోపిస్తున్నట్టు దొంగ ఓటు ఎక్కడేస్తారు? పోలింగ్‌బూత్‌లో కదా? అక్కడ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఏజెంట్లు ఉంటారు. అన్నీ తనిఖీ చేశాకే ఓటు వెయ్యనిస్తారు. దొంగ ఓటేస్తే పట్టుకోరా? అసలు దొంగ ఓట్లయితే పోలింగ్‌బూత్‌లో పట్టుకోవాలి. బస్సులను అటకాయించి, భక్తులను దొంగ ఓటేయటానికి వచ్చారనడం ఏమిటి? అంటే టీడీపీకి ఏజెంట్లే లేని దిక్కుమాలిన స్థితి వచ్చిందా? ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర బలగాలను దించారు. కేంద్ర పరిశీలకులూ ఉన్నారు. పోలింగ్‌ బూత్‌ల్లో వెబ్‌ కెమెరాలున్నాయి. వీటిని దాటుకుని పోవడం సాధ్యమా? ఎన్నికల్లో దెబ్బతినే ప్రతీసారి ముందే సాకులు వెతుక్కోవడం చంద్రబాబుకు అలవాటే’’ అని విమర్శించారు. 

దొంగ ఓట్ల చరిత్ర టీడీపీదే
డిపాజిట్లు కూడా రాని పార్టీలు మాత్రమే దొంగ ఓట్లు వేయించాలనుకుంటాయని, అలాంటి పని టీడీపీనో, బీజేపీనో చేసే వీలుంది తప్ప వైఎస్సార్‌సీపీకి ఏం అవసరమని సజ్జల అన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం ప్రజలు వైఎస్‌ జగన్‌ వైపే ఉన్నారని ఇటీవలి ఎన్నికలే రుజువు చేశాయి. ఏ అవకాశం వచ్చినా జగన్‌కు ఆశీస్సులివ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తిరుపతిలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం. ఓడిపోతామని తెలిసే టీడీపీ కారణాలు వెతుక్కుంటోంది. ఇందులో భాగమే దొంగఓట్ల నాటకం. ఫలితాలు వచ్చాక ఆ పార్టీ ఇదే చెప్పబోతోంది. తిరిగి ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్‌ చేయడంలో హేతుబద్ధత లేదు. ఇదే జరిగితే కేంద్ర ఎన్నికల సంఘం తనను తాను అవమానించుకోవడమే. ఎన్నిసార్లు ఎన్నికలు పెట్టినా వైఎస్సార్‌సీపీకి ఓట్లు పెరుగుతాయే తప్ప తగ్గవు’’ అని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు