తెలంగాణ వాళ్లు దాదాగిరి చేస్తున్నారు 

3 Aug, 2021 03:29 IST|Sakshi
మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి. చిత్రంలో మంత్రులు బాలినేని, అనిల్, ఎమ్మెల్యేలు

ప్రభుత్వ సలహాదారు సజ్జల 

నెల్లూరు(సెంట్రల్‌): మనకు రావాల్సిన నీటిని రానీయకుండా.. ఏకపక్షంగా నీటిని వదిలేస్తూ మనపై తెలంగాణ వాళ్లు దాదాగిరి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. నెల్లూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్‌ శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యతో కలసి సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో పలు అక్రమ కట్టడాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఏపీకి నేడు ఈ దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీళ్లందించేందుకు ప్రయత్నిస్తుంటే, తెలంగాణ వాళ్లు ఏకపక్షంగా నీటిని తోడేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ, నెల్లూరుకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా సీఎం చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌసింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇళ్లు అందేలా చేస్తామని సజ్జల స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు