ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

18 Aug, 2021 03:37 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల కంటే మిన్నగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  

కడప కార్పొరేషన్‌: ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. త్వరలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మున్సిపల్, పంచాయతీల ఎన్నికల ఫలితాల కంటే మిన్నగా ఉంటాయన్నారు. కడపలో ఆయన మంగళవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబులతో కలిసి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. 95 శాతం ఎన్నికల హామీలను ఇప్పటికే అమలు చేయడంతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని గుర్తు చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఇతర దేశాలతో పోల్చే విధంగా ప్రపంచ చిత్రపటంలో పెట్టారన్నారు. ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న సీఎంకు వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయం ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు. త్వరలో జరగనున్న బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ పరంగా సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు