గ్రహణం వీడింది: సజ్జల 

17 Sep, 2021 02:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తాజాగా హైకోర్టు ఆదేశాలతో దీర్ఘకాలంగా ప్రజా తీర్పునకు పట్టిన గ్రహణం వీడినట్లయిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018లో సర్పంచ్‌ ఎన్నికలు, 2019లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా గత సర్కార్‌ నిర్వహించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాక టీడీపీ కార్యాలయం సూచనల మేరకే 2020 మార్చి 15న నాటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కరోనా సాకుతో ఏకపక్షంగా వాయిదా వేశారని చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు రోజుల ముందు కరోనా ప్రభావం లేకున్నా నిమ్మగడ్డ కావాలనే వాయిదా వేసినట్టు తెలిపారు.  అజెండాలో లేకున్నా ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్‌ ఎన్నికలను ముందుకు తెచ్చి టీడీపీపై కృతజ్ఞత చాటుకుని నిమ్మగడ్డ పదవీ విరమణ చేసి వెళ్లిపోయారన్నారు.  

చంద్రబాబే దోషి.. 
ఈ ఎన్నికల ప్రక్రియలో జరిగిన పరిణామాలన్నింటికీ చంద్రబాబే దోషి అని సజ్జల స్పష్టం చేశారు. వ్యవస్థల్లో సాంకేతిక లొసుగులను అడ్డు పెట్టుకుని పార్టీ నేతలతో పిటిషన్లు దాఖలు చేయించడం వల్ల ఏప్రిల్‌లో పూర్తి కావాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటిదాకా కొనసాగిందన్నారు. దాదాపు 6 నెలలపాటు ఓట్ల లెక్కింపు జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. విజ్ఞులు, సామాజికవేత్తలు, మేధావులు ఈ అంశంపై ఆలోచించాలని కోరారు.ఎన్నికల ప్రక్రియను ఏళ్ల తరబడి ఆపగలగడాన్ని అంగీకరించాలా?  అని ప్రశ్నించారు. దిశ బిల్లు ప్రతులను లోకేశ్‌ తగలబెట్టడం ఆయన మానసిక స్థితికి నిదర్శమన్నారు.

పింఛన్లపై దుష్ప్రచారం 
పేదరిక నిర్మూలనకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ, దాని అనుకూల మీడియా దుష్ప్రచారాన్ని అడ్డుకుని ప్రజలకు వాస్తవాలను తెలియచేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి, బోయ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మధుసూదనరావు అధ్యక్షతన నిర్వహించిన వాల్మీకి, బోయ కులస్తుల ఆత్మీయ సమావేశానికి సజ్జల హాజరయ్యారు. చంద్రబాబు హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇవ్వగా సీఎం జగన్‌ ఆ సంఖ్యను 60 లక్షలకు పెంచారని చెప్పారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండూ ఓసీలకు రిజర్వ్‌ అయిన మండలాల్లో ఒకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చేలా సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు. బీసీలు ఇతర కులాలకు కూడా నాయకత్వం వహించేలా సీఎం జగన్‌ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సజ్జల సూచించారు.

సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదే 
ఆనాడు వాల్మీకి రామాయణాన్ని రచిస్తే, సీఎం జగన్‌ పేదల జీవితాలు బాగు చేసే కార్యక్రమాలను రూపొందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బోయ, వాల్మీకి కులానికి చేసిన వాగ్దానాలను సీఎం జగన్‌ నిలబెట్టుకుంటున్నారని కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరామ్‌ చెప్పారు. వాల్మీకి, బోయ కులస్తుల అభివృద్ధికి సీఎం జగన్‌ పలు పథకాలను అమలు చేస్తున్నారని ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. బీసీ కులాల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు నెలలుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాల్మీకిలు బీసీలుగా మరికొన్ని చోట్ల ఎస్టీలుగా ఉన్నారని, దీన్ని సరి దిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సమావేశంలో నవరత్నాలు నారాయణమూర్తి, వాల్మీకి, బోయ కార్పొరేషన్‌ డైరెక్టర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు