పీఆర్సీ గ్యారెంటీ

7 Dec, 2021 04:33 IST|Sakshi

కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నది ఉద్యోగులకూ తెలుసు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

బాబు ఏజెంట్ల మాటలు వినే కేంద్ర మంత్రి అలా మాట్లాడారు: సజ్జల

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కచ్చితంగా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ‘ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం. మా ప్రభుత్వ ఆలోచనలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది వారే. అలాంటి ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుంది తప్ప కోపం ఉండదు’ అని పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఎవరూ అడగకుండానే ఉద్యోగులకు 27% ఐఆర్‌ (మధ్యంతర భృతి) ఇచ్చారని గుర్తు చేశారు.

టీడీపీ హయాంలో చంద్రబాబు పీఆర్సీని వేయడంలో తీవ్ర జాప్యం చేశారని, డీఏలు కూడా ఇవ్వలేదని ఎత్తిచూపారు. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నది ఉద్యోగులకు తెలుసని, అందుకే వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి అన్ని వర్గాల ఉద్యోగులకు వేతనాలు పెంచామని గుర్తు చేశారు.

2018–19లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు రూ.32 వేల కోట్లు ఉంటే.. 2020–21కి రూ.50 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. వేతనాలు, డీఏ తదితరాలను పెంచడం వల్ల ఏడాదికి రూ.18 వేల కోట్ల మేర ఉద్యోగులకు అదనంగా చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులు సంయమనం పాటించాలని, గడవులోగా పీఆర్సీ ఇస్తామని చెప్పారు. తాము తల్చుకుంటే ప్రభుత్వాలను కూల్చగలం.. నిలబెట్టగలమని నలుగురైదుగురు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడటం సరికాదన్నారు. కావాలంటే వారు నలుగురూ రాజకీయ పార్టీలు పెట్టుకుని.. ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని సూచించారు. 

అధికారంలో ఉన్నప్పుడెందుకు చేయలేదు బాబూ? 
రాష్ట్రంలో దశాబ్దాలుగా గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణాలు తీసుకుని.. ఇళ్లు నిర్మించుకున్న పేదలకు వాటిపై సంపూర్ణ హక్కు లేదని సజ్జల చెప్పారు. అసలు, వడ్డీని ఏకకాలంలో నామమాత్రపు చెల్లింపుతో పరిష్కరించి.. ఉచితంగా పేదల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించి.. అమ్ముకోవడానికి హక్కు కల్పించేలా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారని చెప్పారు. పేదలకు ప్రయోజనం కలిగే ఈ పథకాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుపట్టడంపై మండిపడ్డారు.

2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణానికి పేదలు తీసుకున్న రుణంపై వడ్డీ మాఫీ చేయాలని ఐదు సార్లు అధికారులు ప్రతిపాదనలు పంపితే.. నాటి సీఎం చంద్రబాబు అంగీకరించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే అసలు, వడ్డీని మాఫీ చేసి, ఉచితంగా ఇళ్లను అందిస్తానని బాబు చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. పేదలకు ప్రయోజనం చేకూర్చే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఎవరినీ బలవంతం పెట్టడం లేదని.. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే వర్తింపజేస్తామని తేల్చిచెప్పారు. 
చదవండి: రాష్ట్రానికి తుపాన్ల దెబ్బ.. 90వేల కోట్లు నష్టం

చంద్రబాబు ఏజెంట్ల మాటలు వినే.. 
రాయలసీమలో 140 ఏళ్ల తర్వాత కుంభవృష్టి కురవడంతో అన్నమయ్య ప్రాజెక్టును 3.20 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తిందని సజ్జల చెప్పారు. ఆ ప్రాజెక్టు స్పిల్‌ వే సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులేనని, అంతకు మించి వరద రావడంతో మట్టికట్ట తెగిందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టు దిగువ గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించి, పునరావాసం కల్పించామన్నారు. లేదంటే ప్రాణ నష్టం అధికంగా ఉండేదన్నారు. కేంద్ర బృందం కూడా ఇదే అంశాన్ని చెప్పిందని గుర్తు చేశారు. కేంద్ర బృందం నివేదికను పరిశీలించకుండా.. చంద్రబాబు ఏజెంట్ల మాటలు వినే కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వాస్తవ విరుద్ధమైన మాటలు మాట్లాడారని చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి ఎంత నీరు వస్తుందో అంచనా వేయడానికి ఇప్పటిదాకా ఏర్పాట్లు లేవన్నారు.
చదవండి: వ్యవసాయ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా కొలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల మనిషని, కష్టాల్లో తోడునీడగా నిలబడతారని చెప్పారు. ప్రజలు ప్రేమతో సీఎం జగన్‌తో సెల్ఫీలు తీసుకుంటే తప్పుపట్టే చంద్రబాబు.. పోలీసులు బారికేడ్లు పెడితే ప్రజలంటే సీఎం జగన్‌కు భయమని విమర్శించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఎప్పుడో జరిగిన ఘటనకు ఇవాళ్టికి కూడా ఎన్‌ఎస్‌జీ గార్డులను చుట్టూ పెట్టుకుని ప్రజల్లో తిరిగే చంద్రబాబు.. సీఎం జగన్‌ భద్రతపై మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. 

మరిన్ని వార్తలు