చంద్రబాబు.. ఎందుకింత ఆవేశం..!

21 Jan, 2021 14:45 IST|Sakshi

నిన్న జరిగింది కళా వెంకట్రావు అరెస్ట్ కాదు..

కేవలం పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చారు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, తాడేపల్లి: డీజీపీపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు సరికాదని  ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంతబొమ్మాళిలో నంది విగ్రహం తొలగించింది టీడీపీ నేతలేనని మండిపడ్డారు. చదవండి: బుల్లెట్‌ ప్రూఫ్‌ లేకుంటే ఎంపీ సాయిరెడ్డికి ఏమయ్యేదో

చంద్రబాబు తీరు దబాయింపు ధోరణిలో ఉందని.. ఆయన మానసిక స్థితిపై ఏమనుకోవాలో అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబు శాడిజం ఏంటో అర్ధం కావటం లేదని.. 41 సీఆర్‌పీసీ నోటీసు గురించి ఆయనకు అవగాహన లేదా? అని ప్రశ్నించారు. ‘‘విగ్రహాలను ఎవరైనా రాజకీయ నాయకులు తీసుకెళ్తారా?. చంద్రబాబుకు ఎందుకు ఇంత ఆవేశం, ఫ్రస్ట్రేషన్‌?. చిన్నపిల్లల మాటల కంటే అధ్వానంగా చంద్రబాబు మాటలున్నాయి.సీఎం జగన్‌ను టార్గెట్ చేయడమే చంద్రబాబు లక్ష్యం’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చదవండి: ‘ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం’)

‘‘నిన్న జరిగింది కళా వెంకట్రావు అరెస్ట్ కాదు. కేవలం పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చారు. చంద్రబాబు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. కళా వెంకట్రావు అరెస్ట్ జరగకపోయినా జరిగినట్లు ఎలా మాట్లాడతారు? చంద్రబాబు రాజకీయంగా పతనం అయ్యారు. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి జూమ్ మీటింగ్‌లు పెడతారు. స్థానిక ఎన్నికలు జరిపి ప్రజలను, ఉద్యోగులను బలి పశువులను చేయాలంటారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఎస్‌ఈసీ రాసిన లేఖలో ఎన్నికలకు సంబంధం లేని అంశాలు ఉన్నాయని’’ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు