ధైర్యం చెప్పకుండా దుష్ప్రచారమా?

8 May, 2021 03:44 IST|Sakshi

విపక్ష నేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల ధ్వజం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ 440 కె స్ట్రెయిన్‌ అనే కొత్త వైరస్‌ వ్యాపించిందంటూ విపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విష ప్రచారంతో ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారు అవమానాలకు గురవుతున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కక్షతో బాధ్యత మరచి చిల్లర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలో ఆలోచించాలని పౌర సమాజం, మేధావులు, ప్రజలను కోరారు.

కోవిడ్‌తో ప్రజలు అల్లాడుతుంటే రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం ఏమిటని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రమాదకరమైన వైరస్‌ కర్నూలులో పుట్టిందని అనుకూల మీడియాలో చంద్రబాబు అజ్ఞానంతో దుష్ప్రచారం చేయడం వల్ల ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలపై ఆంక్షలు విధించాయన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

కోవిడ్‌పై పోరాటంపైనే సీఎం దృష్టి..
ఏపీలో ఎన్‌ 440 కె స్ట్రెయిన్‌ ప్రభావం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో ల్యాబ్‌ కల్చర్‌  చేసినప్పుడు అలా వచ్చింది. దాన్ని సీరియస్‌గా తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. కోవిడ్‌ సవాల్‌ను ఎదుర్కోవడం, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపైనే సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టంతా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించడం ప్రతిపక్ష నేత బాధ్యత. దీన్ని విస్మరించి ఇన్నాళ్లూ ఆయన్ను భరించిన రాష్ట్రాన్ని అభద్రతా భావంలోకి నెట్టడానికి మనసెలా ఒప్పింది? తప్పుడు ప్రచారంపై కర్నూలు జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఇప్పటికే కేసులు పెట్టింది. ఇదేరీతిలో రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెట్టాలి.   

వ్యాక్సిన్లపైనా అబద్ధాలే..
వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ, నిర్వహణ పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయ లబ్ధికి పాకులాడుతున్నారు. ఏప్రిల్‌ 9న టీకా ఉత్సవం సందర్భంగా రాష్ట్రానికి 25 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు పంపాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం లేఖ రాస్తే 6.4 లక్షలు వ్యాక్సిన్లు మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత కూడా మరో లేఖ రాశారు. కేంద్రం పంపిన వ్యాక్సిన్లలో 6.28 లక్షలు ఏప్రిల్‌ 14న ఒకే రోజులో వేశాం. ఇది దేశంలోనే రికార్డు. సచివాలయాలు, వలంటీర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మిగిలిన రాష్ట్రాల కంటే వేగంగా, మెరుగ్గా వ్యాక్సిన్‌లు ఇవ్వగలిగే వ్యవస్థను సీఎం జగన్‌ తెచ్చారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. కోవిడ్‌ సమస్యపై క్షుణ్నంగా చర్చించేందుకు క్యాబినెట్‌ సమావేశంలో చివరి అంశంగా చేరిస్తే దానిపైనా చంద్రబాబు రాజకీయం చేశారు.  

మరిన్ని వార్తలు