చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారు: సజ్జల

26 Aug, 2020 14:02 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పును రాష్ట్ర ప్రజలపై నెట్టారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో కోల్పోయి 14 నెలలు అయినా చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు తన స్వార్థం కోసమే ఆలోచించారు తప్ప ప్రజల గురించి ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.స్వార్థానికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అని విమర్శించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు విధ్వంసం అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లడం విధ్వంసమా? అవినీతి రహిత పాలన అందించడం విధ్వంసమా అని సజ్జల ప్రశ్నించారు.
(చదవండి : చంద్రబాబు పేరు చెబితేనే ప్రజలు భగ్గుమంటున్నారు)

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. వరదల సమయంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని సజ్జల ప్రశ్నించారు. సీఎం జగన్‌ 14 నెలల పాలనలో 53 వేల కోట్ల రూపాయల సంక్షేమం నేరుగా ప్రజలకు అందించారని పేర్కొన్నారు. ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను అందిస్తున్న గొప్ప ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ది అని ప్రశంసించారు. సీఎం జగన్‌ సంక్షేమ యజ్ఞం చేస్తుంటే.. చంద్రబాబు రాక్షసుడిలా అడ్డుకుంటున్నారని సజ్జల విమర్శించారు.

మరిన్ని వార్తలు