అధికారం ఊడిందనే అక్కసు

28 Oct, 2021 05:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడం, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వారం క్రితం ప్రారంభించిన బూతు డ్రామాకు మంగళవారం ఢిల్లీ వేదికగా తెరదించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారం ఊడిందనే అక్కసుతో.. తనకు ఓటు వేయని ప్రజలపై కక్ష తీర్చుకునేలా  చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఢిల్లీలో చంద్రబాబు బూతు డ్రామాను ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఎల్లో మీడియా ద్వారా ఏదో జరుగుతోందని చూపించే ప్రయత్నం చేశారని ఎద్దేశా చేశారు. అందులో భాగంగానే ‘ఈనాడు’లో అశ్వత్థామ హతః కుంజరః అన్నట్లుగా ‘రాష్ట్రపతి పాలన పెట్టండి’ అనే డిమాండ్‌తో బ్యానర్‌ హెడ్డింగ్‌లు పెట్టించి తృప్తి పడ్డారని దెప్పిపొడిచారు. బూతులు తిట్టించిన చంద్రబాబేమో ఢిల్లీ నుంచి కిక్కురుమనకుండా హైదరాబాద్‌ చేరుకున్నారని, తిట్టినవాడేమో మాల్దీవులకు పోయాడని మండిపడ్డారు.  ఈ సమావేశంలో సజ్జల ఇంకా ఏమన్నారంటే..

ఢిల్లీలో దివాలా తీసిన చంద్రబాబు 
► తిమ్మిని బమ్మి చేయటమే కాదు.. శూన్యంలోంచి చంద్రబాబు ఏమైనా సృష్టించగలరు. ఒక ఛండాలమైన బూతు మాటను సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడితే.. దానిపై వచ్చిన ప్రతిస్పందన చూసి చంద్రబాబు పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలని ప్రయత్నించారు. 
► ఒక రోజు బంద్‌కు పిలుపు ఇచ్చారు. 36 గంటల నిరాహార దీక్ష చేసిన డయాబెటిక్‌ పేషెంట్‌ ఊగిపోతూ గంటన్నర సేపు నినదించి ప్రసంగించారు. అంతశక్తి ఉందంటే అది దీక్షకాని దీక్ష అనుకోవాలి. దాన్ని వ్యూహాత్మకంగా ముగించాలని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. అక్కడ చంద్రబాబు దివాలా తీశారని పసిగట్టిన జాతీయ మీడియా ఆయన పర్యటనను ఏమాత్రం పట్టించుకోలేదు.

అమిత్‌ షా ఫోన్‌ చేశారని మరో డ్రామా
► ఢిల్లీలో రాష్ట్రపతిని చంద్రబాబు బృందం కలిసింది. రాష్ట్రపతి ఏమన్నారో తెలియదు. చంద్రబాబు అయితే చెప్పాల్సింది చెప్పి, కక్కాల్సింది కక్కారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రమ్మని పిలిచినట్లు.. శిఖరాగ్ర చర్చలు జరిపి.. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనకు తెరదించేలా అమీతుమీ తేల్చుకోనున్నట్లు చంద్రబాబు కలరింగ్‌ ఇచ్చారు. కానీ అమిత్‌ షా అపాయింట్‌ మెంట్‌ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో ఎల్లో మీడియా రాయలేదు. 
► అదే సీఎం వైఎస్‌ జగన్‌ అమిత్‌ షాను కలిస్తే.. మొట్టికాయలు వేశారని ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాక అమిత్‌ షా ఫోన్‌ చేసినట్లు ఎల్లో మీడియాకు చంద్రబాబు లీకులు ఇచ్చి మరో డ్రామాకు తెరతీశారు. అమిత్‌ షా ఫోన్‌ చేశారో లేదో తెలియదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చక్రం కాదు కదా.. దీపావళి పండుగ పూట తిప్పే విష్ణు చక్రం కూడా తిప్పలేదు. 
► చంద్రబాబుకు ఏనాడూ ప్రజలంటే ప్రేమ, అభిమానం లేదు. లెక్కలేనితనం ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. గంజాయి సాగు, స్మగ్లింగ్‌కు రాష్ట్రం రాజధానిగా మారిందని చెప్పడం దారుణం. చంద్రబాబుకు ఏ సెక్షన్‌ కింద ఎంత కఠినాతి కఠినమైన శిక్ష వేసినా తప్పులేదు. 
► చంద్రబాబు ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారు. దారినపోయేవాడు అక్కసుతో తిడితే దానికో అర్థముంటుంది. ఈ రాష్ట్రంలో యువతకు బూతులు నేర్పాలని 
అనుకుంటున్నావా? 

టీడీపీ సర్కార్‌ హయాంలోనే గంజాయి స్మగ్లింగ్‌ 
► 2016లో నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ప్రాంతం కేంద్రంగా గంజాయి వెళ్తోందని ఏమాత్రం దాపరికం లేకుండా మాట్లాడారు. దీనిపై చంద్రబాబు, ఆయన్ను సపోర్ట్‌ చేసే పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలి. 
► సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను తుదముట్టించడానికి ఎస్‌ఈబీని ఏర్పాటు చేశారు. ఏడాదిలోనే 3 లక్షల కిలోలకుపైగా గంజాయిని ఎస్‌ఈబీ స్వాధీనం చేసుకుంది. సాగు చేసిన గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు. స్మగ్లర్లకు పెద్ద ఎత్తున శిక్షలు పడుతున్నాయి. ఇది వాస్తవం కదా? 
► ఎయిడెడ్‌ స్కూళ్లపై చేస్తున్న ఆందోళన వెనుక టీడీపీ నేతల పాత్ర ఉంది. ఎవరి మెడ మీదా కత్తి పెట్టి బలవంతంగా స్కూళ్లను తీసుకోలేదు.  
► దేశంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా పార్టీ పెట్టుకోవచ్చు. కేసీఆర్‌ కూడా రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవచ్చు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఉమ్మడి ఏపీ దేశంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్‌సీపీ చెప్పింది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో అడ్డగోలుగా విద్యుదుత్పత్తి చేస్తుండటం, సింగరేణి బొగ్గు గనులు ఉండటం వల్లే తెలంగాణలో విద్యుత్‌ సమస్య ఉత్పన్నం కాలేదన్నది వాస్తవం కాదా? 

చదవండి: కాంగ్రెస్ ,బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి: అంబటి రాంబాబు

మరిన్ని వార్తలు