దొంగ ఓట్లు వేసే అవసరం మాకు లేదు: సజ్జల

17 Apr, 2021 15:09 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రశాంత వాతావరణంలో తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు. అయితే చంద్రబాబు ఈ రోజు కూడా అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలింగ్‌పై టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తిరుపతికి వచ్చే టూరిస్టులు దొంగ ఓటర్లని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ఆయన గతంలో చేసిన పనులను తమ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓడిపోతారని తెలిసే బాబు ముందుగా సాకులు వెతుక్కుంటున్నారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మహన్‌రెడ్డి‌ వెంట 75 శాతానికిపైగా ఓటర్లు ఉన్నారన్నారు. దొంగ ఓట్లు వేసే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డిపాజిట్‌ కూడా దక్కదనే భయంతోనే చంద్రబాబు దొంగ డ్రామాలు ఆడుతున్నారని, ఓటమిని ఊహించిన బాబు ముందుగానే సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు.

చదవండి: ‘పవన్‌ కళ్యాణ్‌ నటుడు, చంద్రబాబు సహజ నటుడు​’

మరిన్ని వార్తలు