కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్న టీడీపీ

25 Sep, 2020 04:30 IST|Sakshi

అమరావతి కుంభకోణం నుంచి దృష్టిని మళ్లించేందుకే 

తిరుమల డిక్లరేషన్‌ వివాదం సృష్టించి బోర్లా పడ్డారు. 

ముఖ్యమంత్రి జగన్‌ అత్యంత నిష్టతో శ్రీవారి సేవలో గడిపారు 

బీజేపీ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ముగ్గులో పడింది 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: అమరావతిలో రాజధాని పేరుతో జరిగిన భారీ భూ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి రాష్ట్రంలో ప్రతిపక్షాలు కుట్ర పూరితంగా కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియా, ఇతర శక్తులు మతపరమైన వివాదాలను ముందుకు తీసుకువస్తున్నాయి. 
► జగన్‌ పాలనను అస్థిరం చేయాలన్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ముగ్గులో బీజేపీ పడింది. మొదట్లో యాదృచ్ఛికంగా ప్రారంభమైన ఈ ఘటనలు విగ్రహాలను ధ్వంసం చేసే రాక్షసక్రీడ, వికృత చేష్టలుగా మారడానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీనే కారణం. వారి వెనక తైనాతీలు, ఈ ముగ్గులోకి దిగి ఈ మధ్య వీరంగం వేస్తున్న బీజేపీ నాయకులు వున్నారు. 
► టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్‌ తిరుమల కొండకు వెళ్లారు. ఆనాడు లేని డిక్లరేషన్‌ అభ్యంతరం హఠాత్తుగా చంద్రబాబుకు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది? ఈ వివాదం సృష్టించి ఎవరు తీసిన గోతిలో వారే పడ్డారు. 
► జగన్‌ మాత్రం భక్తి శ్రద్ధలతో కల్మషం లేకుండా శ్రీవారి సేవలో గడిపారు. తిరునామం ధరించిన జగన్‌ గరుడ సేవ, సుందరకాండ పారాయణంలో పాల్గొన్న తీరును ప్రజలంతా గమనించాలి.  
► జగన్‌ నాయకత్వ లక్షణాలు, సచివాలయం, వలంటీర్ల వ్యవస్థ పని తీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రధాని కితాబు ఇచ్చారు. ఎల్లో మీడియా సిగ్గు పడాలి. 
► నిష్పాక్షికంగా తీర్పులు చెప్పాల్సిన న్యాయస్థానాలు ‘డీజీపీ ఇలాగే పని చేస్తే రాజీనామా చేసి పోవాల్సి ఉంటుంది.. ఇలా అయితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పరిపాలన చేస్తోందా?’ అంటూ న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలపై మేం అభ్యంతరం చెబుతున్నాం. అయినప్పటికీ కోర్టుల పట్ల మేం ఎంతో గౌరవంతో ఉన్నాం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా