పేదలంటే వారికి ఏహ్యభావం

10 Dec, 2021 17:38 IST|Sakshi

గృహ నిర్మాణ సంస్థ రుణంతో నిర్మించిన ఇంటిపై పేదలకు సంపూర్ణ హక్కు కల్పించేందుకే ఓటీఎస్‌

అధికారంలో బాబే ఉండాలని, లేకుంటే రాష్ట్రం సర్వనాశనమై పోవాలన్నదే ఈనాడు, ఆంధ్రజ్యోతి లక్ష్యం

సాక్షి, అమరావతి: పేదలంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, ఆ పార్టీలో అంతర్భాగమైన ‘ఈనాడు’ రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఏహ్య భావమని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు మేలు జరుగుతుంటే చూడలేని ఆ ముగ్గురినీ చెత్త బుట్టలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దశాబ్దాల క్రితం గృహ నిర్మాణ సంస్థ వద్ద అప్పు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదలు అసలు, వడ్డీ కలిపి రూ.9 వేల కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం ఇంటిని తనఖా పెట్టుకోలేక, విక్రయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

పేదలకు రుణ భారాన్ని తప్పించి, నామమాత్రపు ధరతో ఇంటిని ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి, వారికి సంపూర్ణ హక్కు కల్పించడానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్‌) ప్రవేశపెట్టాం. రూ.6 వేల కోట్లకు పైగా రిజిస్ట్రేషన్‌ ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. 50 లక్షల మందికి పైగా పేదలు గృహ నిర్మాణ సంస్థ నుంచి అప్పు తీసుకోగా, వారిలో 12 లక్షల మంది అసలు, వడ్డీ చెల్లించినా వారికి ఆ ఇళ్లపై ఇప్పటికీ సంపూర్ణ హక్కు లేదు. 2014 నుంచి 19 మధ్య అప్పుపై వడ్డీనైనా మాఫీ చేయాలని గృహ నిర్మాణ సంస్థ ఐదు సార్లు ప్రతిపాదనలు పంపినా.. అప్పటి చంద్రబాబు సర్కారు తిరస్కరించింది.

ఆ ఐదేళ్లలో 43 వేల మందే అసలు, వడ్డీ చెల్లించారు. వారికీ టీడీపీ సర్కారు ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పించలేదు. ఇప్పుడు ఓటీఎస్‌ కింద అసలు, వడ్డీని ఏకకాలంలో పరిష్కరించి.. గ్రామాల్లో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే ఆ ఇళ్లను లబ్ధిదారుల పేర్లతోనే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. గతంలో రుణాలు చెల్లించిన వారికి రూ.10కే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకాన్ని వర్తింపజేస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ఇంటి పట్టా ఇచ్చిన పదేళ్ల తర్వాత విక్రయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అసైన్‌మెంట్‌ చట్టంలో సవరణ చేశామని కూడా గుర్తు చేశారు. 

మీడియా ముసుగులో ఉగ్రవాదపు రాతలా? 
‘పేదలకు ఉపయోగకరమైన ఓటీఎస్‌ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మీడియాలో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉంటే అంతా పచ్చగా ఉన్నట్లు భజన చేసే ఆ పత్రికలు.. ఇతరులు అధికారంలో ఉంటే సహించలేవు. అధికారంలో ఉంటే బాబు ఉండాలి.. లేకుంటే రాష్ట్రం సర్వనాశనమై పోవాలన్నదే వాటి లక్ష్యం. అందుకే ఆధారాల్లేకుండా విషపు రాతలు రాస్తున్నాయి. చంద్రబాబు చెప్పిన మాటలను పట్టుకుని మీడియా ముసుగులో ఉగ్రవాదం, దాష్టీకాలు సాగిస్తున్నాయి. ‘సాక్షి’ ఆధారాల్లేకుండా ఏనాడూ ఎవరిపైనా ఎటువంటి కథనాలూ రాయలేదు. ప్రభుత్వంపైన, సీఎం వైఎస్‌ జగన్‌పైన టీడీపీ, ప్రతిపక్ష నేతలు చేసే విమర్శలను కూడా ‘సాక్షి’ ప్రచురిస్తూ నిష్పాక్షికంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అభ్యుదయం కోసం విషపు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలను ప్రజలు బహిష్కరించాలి. ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే.. బాబు అధికారంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణ సంస్థ రుణాలు మాఫీ చేసి, ఉచితంగా ఇళ్లపై పూర్తి హక్కు కల్పించాలని ఎందుకు రాయలేదు?’ అని సజ్జల ధ్వజమెత్తారు. 

ప్రత్యామ్నాయాలు సూచించాం.. 
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే లాభసాటిగా నడిపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే కేంద్రానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారని  చెప్పారు. బీజేపీకి మిత్రపక్షమైన జనసేన నేత  పవన్‌.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే నడిపేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు. మహిళా సాధికారత కోసం గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకంపై మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం శాఖల నుంచి ఒకే జీవో జారీ చేయడానికే ప్రస్తుత జీవోలను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ప్రతిపక్షాన్ని రాష్ట్రంలోనే చూస్తున్నామని దుయ్యబట్టారు.  

సీపీఎస్‌ను రద్దు చేస్తాం 
‘టీడీపీ హయాంలో చంద్రబాబు పీఆర్సీని ఆలస్యంగా వేసి, ఉద్యోగులకు అన్యాయం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టగానే ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చారు. పీఆర్సీ కచ్చితంగా ఇస్తాం. సీపీఎస్‌ను రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీలకు కట్టుబడి ఉన్నాం. సీపీఎస్‌ రద్దుపై కమిటీ అధ్యయనం చేస్తోంది. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం సరైంది కాదు. వారి హెచ్చరికలతో వెనక్కి తగ్గం. ముందుకూ వెళ్లం. ఇలాంటి వ్యాఖ్యలతో ఉద్యోగులకే నష్టం. ప్రజల్లో, ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుంది తప్ప కోపం ఉండదు’ అని ఆయన పునరుద్ఘాటించారు. 

చదవండి: (ఆంధ్రజ్యోతివి అసత్య కథనాలు)

మరిన్ని వార్తలు