ఆత్మవిమర్శకు బదులు.. అపనిందలేస్తారా?: సజ్జల

24 Sep, 2021 15:51 IST|Sakshi

2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ

జెడ్పీటీసీ ఎన్నికల్లో 70 శాతం ఓట్లతో తిరుగులేని విజయం సాధించింది

చంద్రబాబు, ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా చెంప చెళ్లుమనేలా ప్రజల తీర్పు

అయినా వారికి సిగ్గురాలేదు

బాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌లు ఏపీకి వలస పక్షులు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, తాడేపల్లి: మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోకుండా సీఎం వైఎస్‌ జగన్‌పై అపనిందలేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం 3 స్థానాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు గెలిపించగలిగారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటూ వలస పక్షుల్లా రాష్ట్రానికి వచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, బాబు భాగస్వామి పవన్‌ కళ్యాణ్‌.. సీఎం వైఎస్‌ జగన్‌కు నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి ఓర్వలేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

►ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 69.55 శాతం ఓట్లు వస్తే.. టీడీపీకి 22.27%, జనసేనకు 3.83%, బీజేపీకి 2.32% ఓట్లు వచ్చాయి. 
►ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 64.8%, టీడీపీకి 25.27%, జనసేనకు 4.34%, బీజేపీకి 1.48% ఓట్లు వచ్చాయి. 
►2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం అయితే.. ఇప్పుడు జెడ్పీటీసీల్లో దాదాపుగా 70శాతం ఓట్లు వచ్చాయి. పరిషత్‌ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సా«ధించింది. సీఎం వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల ఆదరణ, విస్పష్టమైన అభిమానం వ్యక్తమైంది. 
►గత రెండున్నరేళ్లుగా ఏపీలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఎల్లో మీడియా అయితే రోజూ అసత్య కథనాలతో సీఎం ప్రజాస్వామ్య పరిపాలనపై దాడిచేస్తున్నాయి. 
చెంప చెళ్లుమనిపించేలా తీర్పిచ్చినా..
►‘పరిషత్‌’ ఫలితాలు వచ్చాకైనా టీడీపీకి సిగ్గు వస్తుందనుకున్నాం. అసలు ఎక్కడ లోపం ఉందో చూసుకోకుండా తాము ఎన్నికలు బహిష్కరించామని చంద్రబాబు అంటున్నారు. నిజంగా ఎన్నికలు బహిష్కరించి ఉంటే.. ఎందుకు అభ్యర్థులను పోటీకి దింపారు.. అయినా ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇచ్చారు.
►ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా చూస్తే అచ్చెన్నాయుడు 4, బాలకృష్ణ 7, దేవినేని ఉమా 3, పరిటాల సునీత 9, ధూళిపాళ నరేంద్ర 12 స్థానాల్లో మాత్రమే వారి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. కానీ, అత్యంత హీనంగా సాధించింది చంద్రబాబే. అయినా ఆయనకు బుద్ధిరాలేదు. 
►ఎక్కడో గుజరాత్‌లో హెరాయిన్‌ దొరికితే.. దానికి సీఎం వైఎస్‌ జగన్‌కు ముడిపెడుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
►ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు జరిగాయే తప్ప టీడీపీ, ఒక వర్గం మీడియా ఆశించినట్లు ఏమీ జరగలేదు.

తప్పుడురాతలతో వంకరబుద్ధి చూపిస్తే ఎలా..
పరిషత్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చంద్రబాబుతోపాటూ ఆయన్ని మోసే మీడియాలో ఏమాత్రం మార్పురాలేదు. నిధులు మళ్లించేస్తున్నారంటూ ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కుతూ కథనం అచ్చేసింది. నిజానికి.. సివిల్‌ సప్లైస్‌ నుంచి రూ.5,800 కోట్లు, స్టేట్‌ డ్రింకింగ్‌ వాటర్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.940 కోట్లు, స్టేట్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు నుంచి రూ.1,200 కోట్లు, రైతు సాధికార సంస్థ నుంచి రూ.450 కోట్లు మొత్తం రూ.8,390 కోట్లను 2019 ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు పసుపు–కుంకుమకు మళ్లించేసింది. అదే సమయంలో ఆర్‌బీఐ నుంచీ రూ.5వేల కోట్లు డ్రా చేసి.. పసుపు–కుంకుమకు మళ్లించారు. మరి ఆ రోజు మీ పత్రిక ఎందుకు వీటి గురించి రాయలేదు? మీ బాధ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టకూడదు.. కేంద్రం మద్దతు ఇవ్వకూడదు.. కోర్టులు ద్వారా ఆడ్డుకోవాలి.. ఇవే మీ కుట్రలు, కుతంత్రాలు. 

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటే సంతోషం
కేంద్రంతో పవన్‌ కళ్యాణ్‌కున్న సత్సంబంధాలు ఉపయోగించి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుని ఆ క్రెడిట్‌ వాళ్లే తీసుకుంటే చాలా సంతోషం. ఇక ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలవకూడదనే ఉద్దేశంతో బీజేపీ, జనసేనకు టీడీపీ మద్దతిచ్చింది. కాపు, వైశ్య కార్పొరేషన్లు టీడీపీ హయాంలోనే బీసీ శాఖ పరిధిలో ఉన్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఉత్తర్వులపై విమర్శలు చేయడం అంటే.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడంలాంటిదే. వీటన్నింటినీ ఈబీసీ కిందకు మార్చే అవకాశముంది. మండల పరిషత్‌ రెండో ఉపాధ్యక్ష పదవిని కొత్తగా సృష్టిస్తూ ఆర్డినెన్స్‌ తేవాలని నిర్ణయించాం. 
చదవండి:  Andhra Pradesh: డిగ్రీ కోర్సులు.. ఆంగ్ల మాధ్యమంలోనే!
                    ‘మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది’

మరిన్ని వార్తలు