ఇప్పటికైనా అక్రమ నివాసాన్ని ఖాళీ చేయండి: సజ్జల

28 Sep, 2020 10:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: వరద ప్రమాదం ముంచి ఉన్నందున ఇప్పటికైనా అక్రమ కట్టడమైన గెస్ట్‌హౌజ్‌ను ఖాళీ చేయాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు హితవు పలికారు. కోర్టుల ద్వారా రక్షణపొందినా, పైనుంచి వచ్చిన వరద ఇంటిని ముంచివేయక మానదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చంద్రబాబు ఇంటితో సహా 36 భవనాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. ‘‘కృష్ణానదికి వరద వస్తోంది. ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీచేయండి. కోర్టులద్వారా రక్షణపొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా, పైనుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచివేయక మానదుకదా?’’అని ట్విటర్‌ వేదికగా సజ్జల, చంద్రబాబుకు హితవు పలికారు.(చదవండి: అచ్చెన్నపై యూటర్న్‌)

పాతికేళ్లుగా వేస్తున్న రికార్డు ఇది
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్లమెంట్‌ స్థానాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఓ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీల పట్ల చంద్రబాబు గతంలో అవలంబించిన వ్యవహారశైలిపై సజ్జల విమర్శలు గుప్పించారు. ‘‘అధికారంలో ఉండగా చంద్రబాబుగారు, ఆయన కుమారుడు, వారి అనుయాయులు ఇలా వీరంతా అధికారాన్ని అనుభవిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని బీసీలు మోయాలంటారు. దీనికి ఏదో బ్రహ్మాండం జరుగుతున్నట్టుగా ఎల్లోపత్రికలు కలరింగ్‌ ఇస్తాయి. పాతికేళ్లుగా వేస్తున్న రికార్డే ఇది’’అంటూ సెటైర్లు వేశారు. 

కాగా టీడీపీకి ఇప్పటి వరకు జిల్లాల వారీగా అధ్యక్షులు ఉండేవారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పార్లమెంట్‌ స్థానాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించి సరికొత్త విధానాలకు తెరతీశారంటూ చంద్రబాబు అనుకూల మీడియా ఊదరగొడుతోంది. నిజానికి వైఎస్సార్‌సీపీ 2019 ఎన్నికలకు ముందే పార్లమెంటు స్థానాల వారీగా అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు అదే విధానాన్ని అనుసరించారు.
 

మరిన్ని వార్తలు