తెలంగాణ మంత్రికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల గట్టి కౌంటర్‌

13 Nov, 2021 04:15 IST|Sakshi

తెలంగాణ మంత్రులకు ఏపీ సంగతి ఎందుకు?కేసీఆర్‌ ఏం చెప్పారో వినలేదేమో సజ్జల రామకృష్ణారెడ్డి  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న అన్ని సమస్యలను గొడవల్లేకుండా, భేషజాలకు పోకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలంగాణ సీఎం కేíసీఆర్‌ పలు సందర్భాల్లో చెప్పారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలపై ఆయన స్పందించారు.

ఏపీపై తెలంగాణ మంత్రులు విమర్శలు చేయడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. కేసీఆర్‌ చెప్పిన మాటలను వారు వినలేదేమోనని వ్యాఖ్యానించారు. అయినా ఏపీ సంగతి తెలంగాణ మంత్రులకు ఎందుకని ప్రశ్నించారు. ఇలా మాట్లాడటం వల్ల విషయాలు పక్కదారి పడతాయనే తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం వల్ల అందులో వాటా ఇవ్వాలని విభజన సమయంలో గట్టిగా పోరాడామని సజ్జల గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీయటం తప్పు అని నాడు అటు కాంగ్రెస్‌కు, ఇటు చంద్రబాబుకు కూడా చెప్పామన్నారు.

చదవండి: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ 

అప్పుల్లో ముంచేసి విమర్శలా?
టీడీపీ సర్కార్‌ అధికారంలో నుంచి దిగిపోతూ విద్యుత్‌ రంగంపై ఎంత భారం మోపిందో అందరికీ తెలిసిందేనని సజ్జల చెప్పారు. 2014 నాటికి డిస్కంల అప్పులు రూ. 33,580 కోట్లు కాగా టీడీపీ సర్కార్‌ దిగిపోయేనాటికి రూ.70,254 కోట్లకు పెరిగాయని తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి టీడీపీ హయాంలో రూ. 21,540.96 కోట్లకు ఎగబాకాయని గుర్తు చేశారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఈఆర్సీ దగ్గరకు వెళ్లారని ప్రశ్నించారు. డిస్కంలను అప్పుల్లో ముంచెత్తిన వారు ఏ అర్హతతో తమపై విమర్శలు చేస్తారని నిలదీశారు. 

చదవండి: ఎయిడెడ్‌పై చంద్రబాబు ఆందోళనలు విడ్డూరం

మరిన్ని వార్తలు