మహానాడులో మైండ్‌లేని మాటలు

29 May, 2022 08:03 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల 

ఏఎన్‌యూ (గుంటూరు): టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి చంద్రబాబు, లోకేశ్‌ తదితర నాయకులంతా మైండ్‌లేని మాటలే మాట్లాడారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. కేవలం ప్రభుత్వాన్ని, వైఎస్సార్‌సీపీని తిట్టడానికే మహానాడు పెట్టుకున్నట్లున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేస్తున్న మంత్రుల బృందం శనివారం మధ్యాహ్నం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొద్దిసేపు బస చేసింది.

బృందాన్ని కలిసేందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఏం చేస్తుందో మహానాడు వేదికగా చెబుతారేమోనని చూశామని, కానీ అది ఎక్కడా కనిపించలేదని న్నారు. ఏ అజెండా లేని పార్టీ టీడీపీ అని మహానాడు వేదికగా మరోసారి నిరూపించుకున్నారన్నారు. 2017లో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ నిర్వహించామని, ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని వైఎస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారని అన్నారు. అలా చెప్పే ధైర్యం, అంకితభావం టీడీపీకి లేవనేది మహానాడులో స్పష్టమైందన్నారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్‌ వైఎస్సార్‌సీపీపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. బాలకృష్ణవి ఘాటు వ్యాఖ్యలు కాదని.. పిచ్చి వ్యాఖ్యలని ఎద్దేవా చేశారు.  
 

మరిన్ని వార్తలు