రేవంత్, ఈటల రహస్య భేటీ: కేటీఆర్‌

23 Oct, 2021 02:09 IST|Sakshi

ఓ రిసార్ట్‌లో  సమావేశమయ్యారు 

వారు కాదని ఖండిస్తే ఫొటోలు, ఇతర ఆధారాలు ఇస్తాం 

టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీల చీకటి ఒప్పందాలు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ 

‘హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ బీజేపీ అభ్యర్థి కాదు, ఆయన కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి. రెండు జాతీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థితో టీఆర్‌ఎస్‌ అక్కడ పోరాటం చేస్తోంది. రెండు జాతీయ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకుని ఈటల రాజేందర్‌ను గెలిపించడం కోసం కాకుండా, టీఆర్‌ఎస్‌ ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈటల రాజేందర్‌ ఓడిపోయిన తర్వాత ఏడాదిన్నరలో కాంగ్రెస్‌లో చేరేలా రహస్య సమావేశాలు జరిగాయి. గోల్కొండ రిసార్ట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ రహస్యంగా కలుసుకున్న విషయం మాకు తెలుసు.

ఈ సమావేశానికి సంబంధించి మా కార్యకర్తలు, అభిమానులు, రిసార్ట్‌ ఉద్యోగుల ద్వారా నిర్దిష్టమైన సమాచారం ఉంది. రహస్య భేటీ జరగలేదని వారు ఖండిస్తే ఫొటోలు, ఇతర ఆధారాలు కూడా ఇస్తాం. వారిద్దరి సమావేశంలో భాగంగానే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఎవరూ గుర్తించని అనామకుడిని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఉద్దేశ పూర్వకంగానే డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం కూడా చేయడం లేదు. రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఈటలకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు.

ఏది ఏమైనా హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ ఓటమి ఖాయం. టీఆర్‌ఎస్‌ను నిలువరించే శక్తి లేక కరీంనగర్, నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల తరహాలో ఓటు బదిలీ చేసుకుంటున్నారు..’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీసందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజూరాబాద్‌ ఉపఎన్నిక సహా అనేక అంశాలపై శుక్రవారం ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు కేటీఆర్‌ మాటల్లోనే..                              
– సాక్షి, హైదరాబాద్‌

కాంగ్రెస్‌కు డిపాజిట్‌ దక్కదు 
‘రెండు జాతీయ పార్టీలకు రాష్ట్రంలో ఇద్దరు కోతీయ అధ్యక్షులు వచ్చారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నారు. చేతనైతే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి సవాలు చేస్తున్నా. నాగార్జునసాగర్‌లో బీజేపీకి డిపాజిట్‌ దక్కనట్లే, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాదు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న పన్నాగాలను ప్రజలు చిత్తు చేస్తారు.

రాష్ట్రంలో కొత్తగా పుట్టిన పార్టీలు కేసీఆర్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, షర్మిల హుజూరాబాద్‌లో ఎందుకు పోటీ చేయడం లేదు. టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకును ఒక పథకం ప్రకారం చీల్చేందుకు ఢిల్లీ పార్టీలు చేస్తున్న పన్నాగాల్లో వీళ్లు పాచికలు..’ అని విమర్శించారు 

దళితబంధును ఎన్నాళ్లు ఆపుతారు? 
‘ఎన్నికల కమిషన్‌ తన పరిధిని అతిక్రమిస్తోంది. ఇప్పటికే అమలవుతున్న దళితబంధు లాంటి కార్యక్రమాన్ని ఎలా ఆపుతారు? రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌కు కూడా హద్దులు ఉంటాయి. ఇప్పటికే వాసాలమర్రిలో ప్రారంభమైన పథకం హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతోంది. వేల మంది ఖాతాల్లో డబ్బులు కూడా పడ్డాయి. ఒక వేళ ఆపినా వారం రోజులు అడ్డుపడతారేమో.

ఇంత పెద్ద పథకాన్ని కేవలం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం చేపట్టామనడం అర్థరహితం. ఉప ఎన్నిక జరిగే చోట మాత్రమే కోడ్‌ అమల్లో ఉంటుంది. రాబోయే రోజుల్లో పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల్లో కూడా కోడ్‌ పెడతారేమో. కేసీఆర్‌ ప్రచారానికి వస్తే డిపాజిట్‌ దక్కదనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారు..’ అని చెప్పారు. 

ఏదైనా ఎదుర్కొనేందుకు సిద్ధం 
‘టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు వస్తుందని రేవంత్‌రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదం. ఆయన ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియదు. ‘గాంధీభవన్‌లో గాడ్సే దూరాడు’ అని పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌ అన్నారు. ప్రస్తుతం జీవన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వంటి సీనియర్లను పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్న ‘గట్టి అక్రమార్కుడు’ అంతా నడిపిస్తున్నాడు.

టీఆర్‌ఎస్‌ నేతల అక్రమ చిట్టా అంటూ బండి సంజయ్‌ ఎవరిని ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నారు? అతనేమైనా చిత్రగుప్తుడా, పైనున్నవాడు యమధర్మరాజా? మేము ఏదైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈడీ, సీబీఐని వాళ్లు ఎలా వాడుకుంటున్నారో దేశమంతా చూస్తోంది. ఇలాంటి వాటికి మేము భయపడం. ఏం చేసుకుంటారో చేసుకోండి.. చూస్తాం..’ అని అన్నారు. 

ఈటల విషయంలో చట్టం తన పని తను చేస్తుంది 
‘ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కలిసి పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అంతమాత్రానా మేము కుమ్మక్కయినట్లా? క్రిమినల్‌ కేసులున్న తీన్మార్‌ మల్లన్న వంటి వారు బీజేపీని శరణుజొస్తుంటే వారికి షెల్టర్‌ ఇస్తోంది. ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్‌ అనేక పదవులు ఇచ్చి గౌరవించింది. తప్పుచేయక పోతే ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకోవాల్సింది. ఈటల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ అని తెలిపారు. 

త్వరలో నామినేటెడ్‌ పదవుల భర్తీ 
‘రాష్ట్ర కమిటీ ఏర్పాటు తర్వాత హైదరాబాద్, వరంగల్‌ కార్పొరేషన్లకు పార్టీ అధ్యక్షుల నియామకంపై ఆలోచిస్తాం. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఫార్ములా ఏదీ లేదు. గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్‌ ఓ తరం నేతలను తయారు చేశారు. మేం మరో 35 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండేలా నేతలను తయారు చేసుకుంటున్నాం..’అని అన్నారు. 

పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేస్తాం 
‘అధికారం కోసం కాకుండా రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీ మాది. ఒక దశలో పార్టీని త్యాగం చేసేందుకు కేసీఆర్‌ సిద్ధపడినా, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. మా పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకలా శాశ్వతంగా ఉండేందుకు సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తాం. వచ్చే నెల 15 తర్వాత తమిళనాడు వెళ్లి డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు, దేశంలోని ఇతర పార్టీల నిర్మాణం తీరుతెన్నులపైనా అధ్యయనం చేస్తాం.

మా నాయకుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా పదేండ్లు కాదు.. ఇరవై ఏండ్లు ఉండాలన్నదే మా కల. డీఎంకే తరహాలో ఏడెనిమిది దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా ఉండేలా టీఆర్‌ఎస్‌ పార్టీని నిర్మించుకునే దిశగా ముందుకు సాగుతాం. రాబోయే 6 నుంచి 9 నెలల పాటు చురుకుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ప్రభుత్వ కార్యక్రమాల మీదే పెట్టాం.

ఇకపై పార్టీ, ప్రభుత్వానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతాం. ముందస్తు ఎన్నికలు ఉండవంటూ ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు విపరీత అర్థాలు తీయడం సరికాదు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం చెప్పారు. రేవంత్‌రెడ్డి చెప్పినా సరే.. ముందస్తు ఎన్నికలు ఉండవు..’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

ఒక సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి? 
‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని మిత్రులు అంటున్నారు. మహారాష్ట్ర సీఎంను దూషించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చూస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా సీఎంను పట్టుకుని కొందరు 420 గాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలి. ఉద్యమ సమయంలో ఉద్వేగంతో మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కుంభకోణాల నుంచి పుట్టిన వారు మన దగ్గర నాయకులు అయ్యారు. ఏపీలో ఒక సంఘటన జరిగింది.

ఒక సీఎంని పట్టుకుని ఆ బూతులేంటి? అక్కడ టీడీపీ ఆఫీసుల మీద జరిగిన దాడులు ఎవరు చేశారు అనేది పక్కన పెడితే.. దానికి మూలం ఎక్కడుంది? రాజకీయాల్లో ఎందుకు అసహనం? నువ్వు రాజకీయాల్లో ఓడిపోయావు.. సహనం పాటించు. ఐదేళ్ల తర్వాత మళ్లీ జనం వద్దకు వెళ్లు.. బ్రతిమిలాడుకో.. నీకు ఎందుకు ఓటు వేయాలో వివరించు.. అంతే తప్ప దుగ్ధ ఎందుకు? అర్జంటుగా అధికారంలోకి రావాలన్న ఆరాటం ఎందుకు? ప్రజలు అధికారాన్ని వేరొకరికి ఇచ్చారు.

ప్రజలు కూడా మమ్మల్ని 2009లో తిరస్కరిస్తే పోరాటం చేసి 2014లో అధికారంలోకి వచ్చాం. టీడీపీకి అక్కడ అధికారం పోయింది.. ఇక్కడ అంతర్థానమైంది. మా పార్టీ కేవలం తెలంగాణ మీద మాత్రమే దృష్టి పెడుతుంది. మేము ఢిల్లీకి గులాములము కాదు.. గుజరాత్‌కు బానిసలం కాదు.. తెలంగాణ ప్రజలకు మాత్రమే తలొగ్గుతాం. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసే సత్తా కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది’ అని కేటీఆర్‌ అన్నారు.    

మరిన్ని వార్తలు