మీరు ఏ ఎన్నికల్లో గెలిచారు?! 

21 Jun, 2021 00:44 IST|Sakshi

జి–23 నాయకులపై సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ ఫైర్‌  

ఇప్పుడున్న స్థానాల్లోకి ఎలా వచ్చారో గుర్తు చేసుకోండి  

సర్జరీ కంటే ముందు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ పరీక్షలు అవసరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో సంస్కరణలు అవసరమని గళమెత్తుతున్న జి–23 (గ్రూప్‌ ఆఫ్‌ 23) నాయకులపై ఆ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌(68) మండిపడ్డారు. త్యాగాలతోనే సంస్కరణ సాధ్యమవుతుంది తప్ప అకస్మాత్తుగా ప్రశ్నించడం ద్వారా కాదని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్న నాయకులు ఇప్పుడున్న స్థానాల్లోకి ఎలా వచ్చారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. జి–23లోని చాలామంది పెద్దలు పార్టీ పదవుల్లో నామినేట్‌ అయిన వాళ్లేనని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా పదవుల్లో కొనసాగుతూ అదే విధానాన్ని(నామినేట్‌) ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల రణరంగంలో ముందంజలో నిలవాలంటే కాంగ్రెస్‌కు పెద్ద శస్త్రచికిత్స అవసరమని జి–23 నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  

రాహుల్‌ గాంధీ మా నాయకుడు  
పదేళ్లుగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు నేతలు చేసే ‘అద్భుత వ్యాఖ్యానాల’తో పరిష్కారం దొరకదని సల్మాన్‌ ఖుర్షీద్‌ చురక అంటించారు. పార్టీ నేతలంతా కలిసి కూర్చొని చర్చించుకోవాలని, సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయాలా? వద్దా? అనేది రాహుల్‌ గాంధీయే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఆయన పార్టీ అధినేత అయినా కాకపోయినా తమ నాయకుడిగా మాత్రం ఉంటారని వెల్లడించారు. సంస్కరణలు, శస్త్రచికిత్స అంటూ కపిల్‌ సిబల్, వీరప్ప మొయిలీ లేవనెత్తిన అంశాలపై ఖుర్షీద్‌ ఘాటుగా స్పందించారు. ‘‘శస్త్రచికిత్స చేస్తానంటే నేను సంతోషిస్తా. కానీ, నా కాలేయం, మూత్రపిండాలు తీసుకుంటానంటే ఎలా? ఎలాంటి శస్త్రచికిత్స చేయాలనుకుంటున్నారో దయచేసి ఎవరైనా చెప్పండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పార్టీకి సర్జరీ చేయాల్సిందేనని, అయితే, దానివల్ల సాధించదేమిటో, కోల్పోయేదేమిటో స్పష్టత ఇవ్వాలన్నారు. సర్జరీ కంటే ముందు ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్‌ పరీక్షలు అవసరమని తెలిపారు. సమస్య లోతుల్లోకి వెళ్లాలని, దానికి పరిష్కారాన్ని కనిపెట్టాలని అన్నారు.

పదవులు వదులుకుంటేనే సంస్కరణలు సాధ్యం 
సర్జరీ, సంస్కరణలు, ప్రాథమిక మార్పు తీసుకురావడం అంటే ఏమిటో తనకు అర్థం కావడం లేదని సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు. వాటి అర్థాలేమిటో తనకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ‘‘పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని, వారికి (జి–23 నాయకులు) కీలక పదవులు దక్కాలని కోరుకుంటున్నారేమో తెలియదు. అదే నిజమైతే అది సంస్కరణగానీ, సర్జరీ గానీ కాబోదు. ‘నాకొక›పదవి కావాలి’ అని కోరుకోవడం మాత్రమే అవుతుంది’’ అని తేల్చిచెప్పారు. సంస్కరణ అం టూ మాట్లాడుతున్న నేతలు తొలుత ఇతర నాయకులతో మాట్లాడాలని సూచించారు. వారు తనతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

‘‘పార్టీలో సంస్థాగత ఎన్నికలకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఎన్నికలు జరగాల్సిందే. అయితే, ఏ ఎన్నికల్లో గెలిచి వారు (జి–23 నేతలు) ఇప్పుడున్న స్థానాలను చేరుకున్నారో గుర్తుచేస్తే మాలాంటి వారు సులభంగా అర్థం చేసుకుంటారు. సంస్థాగత ఎన్నికల్లో గెలిచి వారంతా పదవులు చేపట్టారా?’’అని ఖుర్షీద్‌ ప్రశ్నించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో అన్ని స్థాయిల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. సంస్కరణ అనేది అకస్మాత్తుగా సాధ్యం కాదని, పొందినదాన్ని వదులుకున్నప్పుడే అది సాకారమ వుతుందని తెలిపారు. పార్టీలో మార్పు రావాలని కోరుకున్నప్పుడు త్యాగాలకు కూడా సిద్ధపడాలని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు