కాంగ్రెస్‌లోకి టీఆర్‌ఎస్‌ నేత సామ

22 Jul, 2021 02:11 IST|Sakshi
బుధవారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డితో కలసి మాట్లాడుతున్న సామ వెంకట్‌రెడ్డి 

కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సామ వెంకట్‌రెడ్డి 

ఢిల్లీలో మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్‌తో భేటీ 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేసినప్పటికీ.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా రాజకీయ లక్ష్యాల కోసం కేసీఆర్‌ పని చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత, తెలంగాణ కనీస వేతనాల బోర్డు చైర్మన్‌ సామ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాల్లో 70 రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్‌ నెరవేర్చలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు కాకుండా కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉందని విమర్శించారు. బుధవారం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

తమకు 33 జిల్లాల్లో ఉన్న కమిటీల్లో 40–50 వేల మందితో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం చాలా బలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం నేతలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని భూములిచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆ భూములు ఇవ్వడం ద్వారా ఎంతమంది యువతకు ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డితో గంటసేపు జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్‌ అనుబంధ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం నేతలు నాగేశ్వర్‌రావు, కలమడుగు రాజేందర్, నాగసముద్రం పురుషోత్తం, పిట్ట శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

‘పెగాసెస్‌’పై నేడు చలో రాజ్‌భవన్‌: రేవంత్‌రెడ్డి 
టెలిఫోన్‌ హ్యాకింగ్, పెగాసెస్‌ అంశాలపై రాష్ట్రంలో నేడు కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో రేవంత్‌రెడ్డి చర్చించారు. ఢిల్లీలోని మాణిక్యం ఠాగూర్‌ నివాసంలో ఆయన భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఎన్నికల సంఘం అధికారులు, న్యాయ వ్యవస్థ ప్రముఖుల ఫోన్లు హ్యాక్‌ చేస్తున్నారని విమర్శించారు. పెగాసస్‌ స్పైవేర్‌ విషయంలో అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఫోన్‌ హ్యాకింగ్‌కు పాల్పడుతున్న వారిపై దేశద్రోహం కేసులు పెట్టాలని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు