రాష్ట్రాన్ని మీరే సంతోషంగా ఏలుకోండి 

21 Sep, 2022 01:22 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు 

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో అన్ని కులాలవారికి దళితబంధు తరహాలో బంధు పథకాలు ప్రకటించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యుల్లోనూ నిరుపేదలున్నారని..రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి ఈ బంధు పథకాన్ని అమలు చేసి..రాష్ట్రాన్ని సంతోషంగా ఏలుకోవాలన్నారు. మంగళవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.

ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు ఎన్నికలోపు అమలు చేయకపోతే ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడం మంచి నిర్ణయమని అదేవిధంగా పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్షపదవి కోసం అశోక్‌ గెహ్లోట్, శశిథరూర్‌ పేర్లు విన్పిస్తున్నాయని, సోనియా, రాహుల్‌ నిర్ణయాన్ని కాదనలేమని చెప్పారు.

మరిన్ని వార్తలు