Jagga Reddy: ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయి?

23 Jun, 2021 00:56 IST|Sakshi

రెండేళ్లుగా కాలయాపన చేశారు: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 57 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి ఇస్తామని మభ్య పెట్టారని, 2 లక్షల ఉద్యోగాలు, ముస్లింలకు రిజర్వేషన్లు, లక్ష రూపాయల రుణమాఫీ లాంటి హామీలను నెరవేర్చకుండానే రెండేళ్లు కాలయాపన చేశారని మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో టీఆర్‌ఎస్‌ ఉంది కాబట్టి ఆ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని, అంతమాత్రాన కాంగ్రెస్‌ బలహీనపడినట్టు కాదని అన్నారు. తనకు నచ్చిన వాడు పీసీసీ అధ్యక్షుడయితే భుజానికి ఎత్తుకుంటానని, లేదంటే నియోజకవర్గానికి పరిమితం అవుతానని జగ్గారెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని, ప్రజలే ఈ ప్రభుత్వాన్ని పడగొడతారని, లేదంటే పార్టీ అంతర్గత కుమ్ములాటలతో అయినా కూలిపోతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు