‘బండి’కి బదులు బీజేపీ లీగల్‌ టీమ్‌

27 Mar, 2023 02:18 IST|Sakshi

సిట్‌ కార్యాలయానికి వెళ్లిన ఆ పార్టీ బృందం 

అధికారుల ఎదుట హాజరై బండి రాసిన లేఖ అందించిన వైనం 

తనకు వ చ్చిన సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టానన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  

నిజాలు నిగ్గు తేల్చాల్సింది పోయి నాకు నోటీస్‌లు ఎలా ఇస్తారని ప్రశ్న 

హిమాయత్‌నగర్, సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ లీకేజ్‌ స్కామ్‌లో పలు ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎట్టకేలకు సిట్‌ రెండో నోటీసులకు స్పందించారు. శనివారం మలిసారి సిట్‌ నోటీసులు జారీ చేయడంతో ఆదివారం తమ పార్టీకి చెందిన లీగల్‌ టీమ్‌ను సిట్‌ కార్యాలయానికి పంపారు.

లీగల్‌ సెల్‌ కన్వి నర్‌ రామారావు, లీగల్‌ సెల్‌ ఇన్‌చార్జి ఆంథోనిరెడ్డి నేతృత్వంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి వచ్చిన బీజేపీ బృందం బండి సంజయ్‌ రాసిన లేఖను అధికారులకు అందించింది. ఆ లేఖలో సంజయ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో  తాను సిట్‌ ఎదుట హాజరుకాలేనని తెలియజేశారు. ఒక ప్రజాప్రతినిధిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ రూపాలు, మార్గాల్లో తనకు సమాచారం అందుతుందని, అదే విధంగా టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ పై తనకు వ చ్చిన సమాచారాన్ని ప్రజల సమక్షంలో (పబ్లిక్‌ డొమైన్‌) పెట్టానని సిట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

 ఇదే విషయాన్ని గతంలోనూ సిట్‌కు తెలిపానని, అయినప్పటికీ మరో­సారి నోటీసులు ఇవ్వడానికి కారణాలను తాను ఊహించగలనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. 

బాధ్యత కలిగిన ఆ మంత్రి అలా ఎలా చెబుతారు? 
టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాలు, ముఖ్యంగా గ్రూప్‌–1 పేపర్‌ లీక్‌ వ్యవహారం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, రాష్ట్ర కేబినెట్‌లో ఓ బాధ్యత గల మంత్రి ఈ వ్యవహారంలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పారని గుర్తు చేశారు. అయితే సిట్‌ ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసిందని, ఆది నుంచీ ఈ స్కామ్‌ను తక్కువ చేసి చూపడానికి, ఈ కుంభకోణం నుంచి దృష్టి మళ్లించడానికి గట్టి ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెడితే ఈ కుంభకోణం వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకును దృష్టిలో పెట్టుకోవాలని సిట్‌కు విజ్ఞప్తి చేశారు.

 ఒకే గ్రామంలో అనేక మంది  టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించడంపై వ చ్చిన సమాచారాన్ని తాను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచానని, అందులోని అంశాలను దర్యాప్తు చేయడానికి బదులు తనకు నోటీసులు ఇచ్చారని సంజయ్‌ తన లేఖలో పేర్కొన్నారు. మార్చి 26 వరకు పార్లమెంట్‌ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు తాను సిట్‌ విచారణకు రాలేనని స్పష్టం చేశారు. సిట్‌ కార్యాలయానికి వెళ్లిన బృందంలో న్యాయవాదులు వేముల అశోక్, దేవినేని హంస, సుంకర మౌనిక తదితరులు ఉన్నారు.  


 

మరిన్ని వార్తలు