థాక్రే అంటే ఇప్పటికీ గౌరవమే.. శివసేనకు వెన్నుపోటు పొడిచి మొత్తం ఆయనే చేశారు!: రెబల్స్‌

30 Jun, 2022 13:54 IST|Sakshi

Maharashtra Political Crisis ముంబై: శివసేనలో సంక్షోభానికి మూల కారకుడు సంజయ్‌ రౌత్‌ అనేది ఆ పార్టీ రెబల్స్‌ ఆరోపణ. అంతేకాదు ఎన్సీపీతో కుమ్మక్కై ఆయన తీరని ద్రోహం చేశాడంటూ మండిపడుతోంది. 

‘‘మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఉద్దవ్‌ థాక్రే అంటే మాకు విపరీతమైన గౌరవం ఉంది. సంజయ్‌ రౌత్‌ ఎన్సీపీకి విధేయుడిగా వ్యవహరించాడు. అందుకే శివసేనకు వెన్నుపోటు పొడిచాడు’’ అని రెబల్స్‌ తరపున ఎమ్మెల్యే దీపక్‌ కేసర్కర్ గురువారం ఉదయం మీడియాతో స్పందించారు. 

సొంత మనుషులే శివసేనను వెన్నుపోటు పొడిచారని, తనపై ఈడీ కేసు కూడా రాజకీయ ప్రతీకారమంటూ తాజాగా సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే.. దీపక్‌ కౌంటర్‌ ఇచ్చారు.

‘‘ఉద్దవ్‌ థాక్రే కుటుంబానికి మేం వ్యతిరేకం కాదు. మహా వికాస్‌ అగాఢితో తెగదెంపులు చేసుకుంటే మేం ఆయనతో చర్చించేవాళ్లం. ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేవాళ్లం కూడా కాదు. ఇప్పటికీ మేం థాక్రేను గౌరవిస్తున్నాం’’ అని దీపక్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. 

ఏక్‌నాథ్‌ షిండే గోవా నుంచి ముంబైకి బయలుదేరారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. కేవలం ప్రజల్లో సానుభూతి కోసమే సంజయ్‌ రౌత్‌ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఉద్దవ్‌ థాక్రే నిన్న(బుధవారం) రాజీనామా చేశారు. కానీ, మాకు ఆయన్ని తప్పించే ఉద్దేశం లేదు. ఇప్పటికీ మేం శివసేనలోనే ఉన్నాం. ఆయన్ని అగౌరవపరచడం, బాధపెట్టడం మా ఉద్దేశాలు ఎంత మాత్రం కాదు.. అని రెబల్స్‌ తరపున దీపక్‌ కేసర్కర్‌ మీడియాకు తెలిపారు. 


చదవండి: థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం!

మరిన్ని వార్తలు