బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేస్తాం: రౌత్‌

26 Sep, 2020 13:40 IST|Sakshi

సమస్యలు లేకపోతే.. పార్శిల్‌ చేస్తాం

సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబై: బిహార్‌లో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీలలో మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో తగినన్ని సమస్యలు లేకపోతే.. ముంబై నుంచి కొన్నింటిని పార్శిల్‌ చేసి పంపిస్తామని ఎద్దేవా చేశారు. బిహార్‌కు చెందిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాన్ని ఎన్నికల సమయంలో ఉపయోగించుకుంటూ లబ్ధి పొందాలని భావిస్తున్నారంటూ ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఎన్నికల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాలపై పోరాడాలి. అయితే ఈ సమస్యలు అయిపోయినట్లు మీరు భావిస్తే చెప్పండి.. ముంబై నుంచి కొన్ని సమస్యల్ని పార్శిల్‌గా పంపుతాము’ అన్నారు. అంతేకాక బిహార్‌ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందన్నారు సంజయ్‌. దీని గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించి.. రెండు-మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతేకాక బిహార్‌ ఎన్నికలు కూలం, ఇతర విషయాల మీద జరుగుతాయి. కార్మిక చట్టాలు, రైతులకు సంబంధించిన సమస్యలను వీరు పట్టించుకోరు అంటూ సంజయ్ రౌత్‌ గ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు!)

దేశంలో కరోనా విజృంభణ అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు అరోరా తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు