1975 ఎమర్జెన్సీ కాల దోషం పట్టిన అంశం

8 Mar, 2021 14:11 IST|Sakshi

ముంబై: ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి అంశం కాలదోషం పట్టిన అంశమని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అప్పటి పరిస్థితులే నయమనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి ప్రధాని, తన నానమ్మ ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పేనంటూ రాహుల్‌ గాంధీ ఇటీవల ఒప్పుకోవడంపై శివసేన పత్రిక సామ్నాలో  ప్రశ్నించారు. ‘అత్యవసర పరిస్థితి విధించినందుకు ప్రజలు ఆమెను శిక్షించారు. ఆమెకు ఒక గుణపాఠం చెప్పారు.

అదే ప్రజలు ఆమెను క్షమించి తర్వాత తిరిగి అధికారం కట్టబెట్టారు. ఎమర్జెన్సీ విషయం అంతటితో ముగిసిపోయింది. మళ్లీ ఎందుకు గుర్తు చేయడం?అని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ సూటిగా, స్పష్టంగా మాట్లాడే వ్యక్తి అంటూ కితాబునిచ్చారు. మీడియా సంస్థలపై ఆధిపత్యం చెలాయించడం, ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ వ్యూహాలు పన్నడం, ప్రతిపక్షాల్లో విభేదాలు పెంచడం, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం వంటివన్నీ 1975లో మాదిరిగానే ఇప్పుడూ జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ స్థానంలో ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.

చదవండి: బెంగాల్‌ టైగర్‌లా గాండ్రిస్తూ మమతా బెనర్జీ

మరిన్ని వార్తలు